Maha Kumbhabhishekam in Srisailam : శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహణను వాయిదా వేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో అత్యవసర ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈనెల 25 నుంచి 31 వరకు నిర్వహించతలపెట్టిన మహా కుంభాభిషేకం, ఇతర పవిత్ర కార్యక్రమాలను జరిపే విధంగా అధికారులను ఆదేశించాలని కోరుతూ అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్ ఛైర్మన్ సంగాల సాగర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం మంగళవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది.
ఇప్పటికే రూ.3కోట్లు ఖర్చు.. ‘ఈనెల 25 నుంచి 31 వరకు శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహణకు రూ.5కోట్ల ఖర్చు అంచనా వేశారని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈనెల 15న రాష్ట్ర ప్రభుత్వం.. వైదిక కమిటీ సభ్యులతో సీఎంవో కార్యాలయంలో సమావేశం నిర్వహించిందన్నారు. దేవాదాయశాఖ మంత్రితోపాటు కమిషనర్ సైతం ఈ సమావేశానికి హాజరయ్యారని.. మహా కుంభాభిషేకం నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని తెలిపారు. అతిథిలను ఆహ్వానించారన్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.3 కోట్లు ఖర్చుచేశారని వెల్లడించారు.
ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఆయా రోజుల్లో ఆర్జిత సేవలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పిటిషన్ లో తెలిపారు. ఈనెల 20న దేవాదాయ కమిషనర్ అకస్మాత్తుగా పత్రిక ప్రకటన విడుదల చేస్తూ కుంభాభిషేకాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారన్నారు. కార్తీకమాసంలో నిర్వహిస్తామని పేర్కొన్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై దేవస్థానం ఈవోని విచారించగా.. రద్దు చేసిన మాట వాస్తవమేనని, ఉన్నతాధికారులు చెప్పింది పాటించడం తప్ప తానేమి చేయలేనని తెలిపారు. వైదిక పరిషత్ సభ్యులను, ట్రస్ట్ బోర్డు సభ్యులను విచారించగా కార్యక్రమ తేదీని మార్చేందుకు తాము ఎలాంటి సమ్మతి ఇవ్వలేదని తెలిపారు.
ఏకపక్ష నిర్ణయం సరికాదు.. ప్రజా ధనం భారీగా ఖర్చు చేశాక కుంభాభిషేకం కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. కుంభాభిషేకం, లింగ ప్రతిష్ఠ చాలా పవిత్రతతో కూడిన వ్యవహారం. దేవాలయ పీఠాధిపతులు, వైదిక పరిషత్ నిర్ణయించిన ముహుర్తం ప్రకారం కార్యక్రమం నిర్వహించాలన్నారు. సంబంధికులందరినీ సంప్రదించాక నిర్ణయించిన కార్యక్రమమన్నారు. కమిషనర్ ఏకపక్షంగా రద్దు చేయడానికి వీల్లేదన్నారు. వేసవి కారణంగా కార్యక్రమాన్ని నిలిపేశామని కమిషనర్ చెబుతున్న మాటలో వాస్తవం లేదన్నారు. సమస్యేదైనా తలెత్తి మహా కుంభాభిషేకాన్ని వాయిదా వేశారని అనుకున్నా.. అలాంటి నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకునే అధికారం కమిషనర్‌కు లేదన్నారు.
దేవస్థానం, పండితులు, పీఠాధిపతులు, గురువులు, వైదిక పరిషత్, ట్రస్ట్ బోర్డు సభ్యులను సంప్రదించాలి. అలాంటిదేమీ లేకుండా కమిషనర్ వాయిదా నిర్ణయం తీసుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. కమిషనర్‌కు కేవలం దేవస్థానంపై పరిపాలన సంబంధ నియంత్రణ మాత్రమే ఉంటుందికాని పండితులు నిర్ణయించిన పూజా కార్యక్రమాల వ్యవహారంలో మార్పులు చేసే అధికారం ఉండదన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ముందుగా నిర్ణయించిన ప్రకారం (ఈనెల 25 నుంచి) మహా కుంభాభిషేకం, లింగ, యంత్ర, శిఖర, కలశ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించేలా అధికారులను ఆదేశించాలని కోరారు.
ఇవీ చదవండి :