యురేనియం తవ్వకాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమంటూ ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయట్లేదని అఖిలపక్షం నిలదీసింది. ప్రధాని మోదీతో భేటీ అయిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అజెండాలో యురేనియం తవ్వకాల అంశం ఎందుకు లేదని ప్రశ్నించింది. ప్రభుత్వ వైఖరి మారకుంటే దిల్లీ వేదికగా పోరాటం చేస్తామని అఖిలపక్షం నేతలు హెచ్చరించారు.
గ్రామాల్లో పర్యటించిన అఖిలపక్షం నేతలు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ఓబులంపల్లి-యాదవాడ గ్రామాల మధ్యలో యురేనియం తవ్వకాల కోసం ప్రారంభించిన అన్వేషణను ఈటీవీ- ఈనాడు కథనాల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై స్పందించిన తెదేపా నేత, మాజీ మంత్రి అఖిలప్రియ... తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆమెకు వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు తెలిపాయి. నేతల నిరసనలతో తవ్వకాలను తాత్కాలికంగా నిలిపేశారు. లొలుత కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించిన అఖిలపక్షం నేతలు.... తుమ్మలపల్లి, కేకే కొట్టాల గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ఓబులంపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. యురేనియం తవ్వకాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే తవ్వకాలకు అనుమతిచ్చారని ఆరోపించారు.
సీఎం ప్రకటన ఏదీ...?
యురేనియం తవ్వకాల వల్ల నల్లమల అటవీ ప్రాంతం పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉందని అఖిలపక్షం నాయకులు వాపోయారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తే... ఆయన మిత్రుడైన జగన్ ఎందుకు నిలిపివేత ప్రకటన చేయట్లేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రభుత్వ వైఖరి మారకుంటే దిల్లీలో నిరసన చేపడతామని అఖిలపక్షం నేతలు హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో తవ్వకాలు జరగకుండా అడ్డుకున్న స్థానికులను అభినందించారు. పార్టీలకతీతంగా ఈ విషయంలో కలిసి పోరాడతామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: