ఫర్, టు.. అనే రెండు ఆంగ్ల పదాలూ కలిసొచ్చేలా 42 పేరిట విజయవాడకు చెందిన రాజశేఖర్ సరికొత్త వీడియోకాన్ఫరెన్స్ యాప్ ను రూపొందించారు. అమెరికాలోని న్యూయార్క్ విశ్వవిద్యాలయం సిబ్బంది ఈ యాప్‌ను పైలట్ పద్ధతిన పరీక్షిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ క్లార్క్ జూమ్ యాప్ కన్నా అదనపు ఫీచర్లు, రక్షణలతో రూపొందించిన దీని పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా వీడియోకాన్ఫరెన్స్ యాప్‌లు ఫ్రీ ట్రయల్, ప్రీమియం వెర్షన్‌లలో ఉన్నట్లే 42 యాప్ కూడా ఈ రెండు వెర్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ట్రయల్ వర్షన్‌ను 30 రోజులపాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
ట్రయల్ వెర్షన్‌లో చాలా యాప్‌లు పరిమిత సంఖ్యలోనే వీడియో కాన్ఫరెన్స్‌కు అనుమతిస్తాయి. కానీ 42 యాప్ ద్వారా ఎంత మంది అయినా కనెక్ట్ కావచ్చు. ఏ దేశంలోని వారు ఈ యాప్‌ను ఉపయోగిస్తే వారికి సంబంధించిన డేటా అదే దేశంలోని సర్వర్‌లో నిక్షిప్తమయ్యేలా ఇందులో భద్రతా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల అన్నిదేశాలూ సురక్షితంగా ఉపయోగించుకోవటంతో పాటు ఆటోమేటిక్ రికార్డింగ్ సౌకర్యం కూడా కల్పించారు.
ఈ 42 యాప్‌కు తొమ్మిది నెలల క్రితమే మొత్తం 4 రకాల గ్రూపులతో రాజశేఖర్ రూపకల్పన చేశారు. విద్యకు సంబంధించిన సమాచారంకోసం 42 స్టూడెంట్స్ పేరిట విద్యార్థులకు మొదట ఇది అందుబాటులోకి తెచ్చారు. ఇంజనీరింగ్‌లో ఎలాంటి కోర్సులు చేసిన వారు ఎన్ని మార్కులు సాధిస్తున్నారు? ఎలాంటి కోర్సులు చదివిన వారికి ఎలాంటి అవకాశాలు లభిస్తున్నాయి? ఎలాంటి కోర్సులు చదివి ఆయా రంగాల్లో ఉద్యోగాలు సంపాదించి ఎంతెంత వేతనాలు సంపాదిస్తున్నారు? తదితర వివరాలతో రూపొందించిన సమాచార బ్యాంకుకు మంచి ఆదరణ లభించింది. దీనికి అనుబంధంగా కళాశాలలు అందించే కోర్సులు, ఇతర వివరాలతో మరో ఆన్ లైన్ అప్లికేషన్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఈ రెండు ఆన్ లైన్ అప్లికేషన్లు సక్సెస్ కావటంతో జూమ్‌యాప్ తరహాలో దాని కంటే అదనపు ఫీచర్లతో 42యాప్ ను అభివృద్ధి చేశారు. కెనడా, అమెరికా లోని విద్యాసంస్థలు పైలట్ పద్దతిన దీనిని పరిశీలిస్తున్నాయి. చాలా సౌకర్యవంతంగా, మంచి ఫీచర్లతో ఉన్న ఈ యాప్ వారికి నచ్చటంతో హార్వర్డ్ విశ్వవిద్యాలయం మేనేజింగ్ డైరెక్టర్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం www.42learn.com లోనూ గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ అందుబాటులో ఉంది.
రాజశేఖర్‌కు తల్లిదండ్రులు లేరు. విజయవాడలో మేనమామ సాయిబాబా అమమ్మల వద్ద పెరిగి ఇంటర్ వరకూ విజయవాడలోనే చదివారు. అండర్ గ్రాడ్యుయేషన్ అమెరికాలో చేసి అక్కడే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ స్థాపించి దాని కోసం ఓ యాప్ రూపొందించారు. అక్కడి బిజినెస్ పోస్ట్ లో దీని గురించి కథనం కూడా ప్రచురించారు.
ఇవీ చదవండి: