సాధారణంగా పింఛన్ల కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడూ పరిశీలించి అర్హుల జాబితా సిద్ధం చేస్తుంటారు. అలా ఎంపికైన వారందరికీ ప్రభుత్వ అనుమతులను బట్టి పింఛన్లు పంపిణీ చేస్తారు. పది రోజుల్లోనే పింఛను లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అర్హత ఉన్నవారు తమవద్దకు వచ్చే వాలంటీరు లేదా సచివాలయంలో దరఖాస్తు అందించాలి. అలా వచ్చిన దరఖాస్తులను సచివాలయాల్లోని సంక్షేమ సహాయకులు కంప్యూటర్‌లో నమోదు చేస్తారు. తరువాత దరఖాస్తుదారుని పూర్తి వివరాలతో ఓ పత్రం వస్తుంది. ఆ పత్రంతో సచివాలయ సిబ్బంది దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తారు. ఆ నివేదికను బట్టి అన్ని పత్రాలు పరిశీలించిన తరువాత గ్రామాల్లో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్‌లు అర్హతను నిర్ధరిస్తారు. అర్హులైతే పింఛను మంజూరు చేయడం, అనర్హులైతే అందుకు కారణాలు చూపి తిరస్కరిస్తున్నట్లు చెబుతారు.
జులైలో కొత్తవి పంపిణీ
జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో పింఛను కోసం వేలాదిమంది గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులైన వారందరికీ ఈ నెలలో మంజూరు చేస్తున్నట్లు పత్రాలు అందజేశారు. ప్రభుత్వం తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలా ఈనెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు వేలకొలది దరఖాస్తులు వస్తున్నాయి. అలా వచ్చిన దరఖాస్తులు అన్నింటినీ ఆన్‌లైన్ చేయడంతోపాటు వెంటనే సామాజిక తనిఖీ కూడా నిర్వహిస్తున్నారు. పది రోజుల్లోనే 9వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈనెల 20లోపు వచ్చిన దరఖాస్తులు అన్నింటినీ పరిశీలించి, అర్హులకు నెలాఖరులోపు పింఛను మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తారు. ఇలా కొత్తగా పింఛన్లకు అర్హత సాధించిన వారందరికీ జులై 1 నుంచే పంపిణీ చేయనున్నారు.
అర్హులందరికీ పింఛన్లు
ప్రభుత్వ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరితగతిన పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చే దరఖాస్తులపై విచారణ చేసి అర్హుల గుర్తింపు కూడా వెంటనే చేపట్టేలా ఏర్పాట్లు చేశాం. దీనికి సంబంధించి మార్గదర్శకాలపై వాలంటీర్లకు కూడా అవగాహన కల్పించాం. ఈ అవకాశాన్ని ప్రజలు కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. 60 ఏళ్లు పూర్తి చేసుకునే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. అలాంటి వారందరూ వాలంటీర్‌కు వివరాలు చెప్పి దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ నిరంతరం ఉంటుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక అధికారుల దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.
- శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ