శరీరంలో రోగనిరోధక శక్తిని సహజంగా పెంచే విధానాల్లో యోగా ఒకటి. వేదకాలం నుంచి ఆదికాలం వరకూ సనాతన భారత సంప్రదాయంలోనే ఇమిడి ఉంది యోగా సాధన. పూర్వీకులు శారీరక, మానసికోల్లాసానికి యోగా ఆచరించారు. ప్రాచీనకాలంలో ఎందరో మునులు, యతులు, రుషులు, యోగులు తమ తపోనిష్టకు అనారోగ్యం అడ్డు కాకుండా కనిపెట్టిన ఆసనాలు, ఆచరించిన శ్వాస సంబంధిత ప్రాణాయామాలు ఇప్పుడు ‘యోగా’ పాఠాలుగా మారాయి. మానసిక సమస్యలకు పరిష్కారం, శారీరక రుగ్మతలకు సమాధానం, అధ్మాత్మికానుభూతికి ఆలవాలం యోగానే. జీవనశైలిలో ఎన్ని హైటెక్ వసతులు, పోకడలు భాగమైనా ప్రాచీన యోగా పద్ధతులతోనే ఫలితాలు సాధిస్తున్నారు చాలా మంది.
మేధాశక్తి , ఆత్మశక్తి కలయిక
యోగా అంటే శారీరక వ్యాయామమనే భావన చాలామందిలో ఇప్పటికీ ఉంది. వాస్తవానికి మేధాశక్తి , ఆత్మశక్తి కలయికగా యోగాను అభివర్ణిస్తారు. రోజువారీ క్రమపద్ధతిలో యోగా సాధన వల్ల శరీరాన్ని, మనసునూ ఉన్నత స్థితికి చేర్చుకోవచ్చని శిక్షకులు చెబుతున్నారు. అంతర్లీనంగా ఉండే శక్తిని సమతుల్య పద్ధతిలో అభివృద్ధి చేసుకునేందుకు యోగా ఒక క్రమశిక్షణలా పని చేస్తుందంటున్నారు.
ఎన్నో మార్పులు
గత శతాబ్దంలో యోగాలో విభిన్న ఆసనాలు ఆచరణలోకి వచ్చాయి. చాలా దేశాల్లో నగరాలు, పట్టణాల నుంచి పల్లెల వరకూ యోగా శిక్షణాలయాలు వెలిశాయి. మన దేశంలోనూ స్థానికంగానే కాకుండా ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన యోగా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. చికిత్స దృక్పథంతో యోగాను జీవన విధానంగా సాధన చేస్తున్న వారూ లేకపోలేదు. మంత్రం, ముద్రలు, ఆసనం, ప్రాణాయామం, యోగానిద్ర, హఠయోగ క్రియలు వంటి ఆసనాల్లో తర్ఫీదు పొందుతున్నారు. విశ్వవ్యాప్తంగా ఎందరో యోగా సాధకులుగా, గురువులుగా కొనసాగుతున్నారు.
వ్యక్తిగతంగా సాధన
ప్రపంచానికి మనదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటని నిస్సందేహంగా చెప్పొచ్చు. 2015లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ రోజును పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యోగా సాధనకు పూనుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామూహిక యోగా సాధనలు ప్రదర్శనలు కాకుండా ఎవరికి వారు వ్యక్తిగతంగా సాధన చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చదవండి