దమ్ముంటే శాసన మండలి వీడియోలు బయటపెట్టాలని తెదేపా ఎమ్మెల్సీలు వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టమని తాము ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వమే పథకం ప్రకారం వాయిదా వేసిందని తెదేపా ఎమ్మెల్సీలు అశోక్ బాబు, గౌరివాణి శ్రీనివాసులు తెలిపారు. ఉభయ సభల వాయిదా అనంతరం తెలుగుదేశం ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణ బయట ఉన్న సచివాలయం రహదారి వద్ద మీడియా సమావేశం నిర్వహించి మండలిలో జరిగిన వివరాలు వెల్లడించారు. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదింపజేయకుండా సీఆర్డీఏ రద్దు, రాజధాని తరలింపు బిల్లులు తేవాలని ముందస్తు ప్రణాళికతో మంత్రులు వ్యవహరించారని ఆక్షేపించారు.
లోకేశ్‌కు దౌర్జన్యం..
తమ సభ్యులపై అధికార పార్టీ సభ్యులు దాడికి దిగారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మండిపడ్డారు. మీడియా ప్రసారాలు నిలిపివేసి సభలో రౌడీయిజానికి దిగారని విమర్శించారు. మంత్రులు తొడలు కొట్టుకోవడం, ప్యాంటు జిప్పులు తీయటం లాంటి చర్యలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. 4సార్లు మేం కూర్చున్న స్థానాల వైపు వచ్చి దాడి చేశారని వెల్లడించారు. నారా లోకేశ్ ఏదో మెసేజ్ టైప్ చేసుకుంటుంటే ఫోటోలు తీస్తున్నారంటూ ఆయనపై దాడి చేసేందుకు యత్నించారని దుయ్యబట్టారు. మండలి వీడియో ఫుటేజ్ బయటపెడితే ఎవరు ఎవరిపై దాడి చేశారో తెలుస్తుందని స్పష్టం చేశారు. మండలిలో 6 బిల్లులు ఆగిపోయాయని ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడు తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుకు మండలి ఆమోదం లభించలేదన్న అయన సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులు ఆమోదం పొందలేదని స్పష్టం చేశారు. మధ్యాహ్నం నుంచి 18మంది మంత్రులు మండలిలో కవ్వింపు చర్యలకు దిగారని మండిపడ్డారు.
ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వరెందుకు?
దమ్ముంటే శాసన మండలి వీడియోలు అన్నీ బయట పెట్టాలని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. మంత్రుల తీరు దారుణంగా ఉందన్న అయన... సభలో మంత్రి అనిల్ అసభ్యకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. మండలి ప్రత్యక్ష ప్రసారాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇవాళ జరిగిన ఘటన వీడియోలు ఎడిట్ చెయ్యకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
యుద్ధ వాతావరణం
పెద్దల సభలో చాలా దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నాయని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. భాజపా, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రేక్షక పాత్ర వహించామన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరికి ఒకరు పోటీ పడి మరీ కొట్టుకున్నారని మండిపడ్డారు. సాయంత్రం నుంచి యుద్ధ వాతావరణం నెలకొందని విమర్శించారు. మరోవైపు శాసన మండలి పరిణామాలపై తెలుగుదేశం నేతలు గురువారం గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేయనున్నారు.
ఇదీ చదవండి
గురువారం గవర్నర్‌తో చంద్రబాబు భేటీ