YCP MP and MLA The followers slapped: కృష్ణా జిల్లా వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నాగాయలంకలో అధికార పార్టీకి చెందిన ఎంపీ బాలశౌరి అనుచరులపై ఎమ్మెల్యే రమేష్ బాబు వర్గీయులు చెప్పులతో దాడి చేసి తీవ్రంగా అవమానించారు. ఎమ్మెల్యే, ఎంపీల మనుషులు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు తగాదాలు పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసిన నాగాయలంక విలేకరులపై ఎమ్మెల్యే వర్గీయులు దుర్భాషలాడుతూ దాడి చేశారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. నాగాయలంక మండలం రేమాలవారిపాలెం పంచాయతీలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఈరోజు నాబార్డు ఛైర్మన్ కె.వి.షాజీ ఆధ్వర్యంలో మత్స్య, డ్వాక్రా సంఘాల సభ్యులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, ఎంపీ, బాలశౌరి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే రమేష్ బాబు, ఎంపీ బాలశౌరి వర్గీయుల మధ్య ఏర్పడిన చిన్న వాగ్వాదం కొట్లాటకు దారి తీసింది. ఇరువర్గాలు పరస్పరం చెప్పులతో కొట్టుకుంటూ, చెంప దెబ్బలతో దాడికి దిగారు. ఒకానొక దశలో ఎమ్మెల్యే రమేష్ బాబుపై కూడా ఎంపీ వర్గీయులు దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యేపై దాడిని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే అనుచరులు ప్రతి దాడి చేశారు.
ఈ క్రమంలో సంఘటనలను చిత్రీకరించేందుకు మీడియా ప్రతినిధులు ఎక్కువ చొరవ చూపించడంతో.. ఎమ్మెల్యే వర్గీయులు దాడికి దిగి, కెమెరాను ధ్వంసం చేశారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అవనిగడ్డ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులకు మధ్య ఫ్లెక్సీల వివాదం ఏర్పడింది. దీనిని మనసులో ఉంచుకున్న ఇరువర్గాలు నేడు నాగాయలంకలో తలపడ్డాయి.
ఈ సంఘటనపై ఎమ్మెల్యే రమేష్ బాబు స్పందిస్తూ..''ఎంపీ బాలశౌరికి నాకు మధ్య ఎటువంటి వర్గ విభేదాలు లేవు. ఒకే వర్గంలా కలిసి పనిచేస్తున్నాం. ఎంపీ బాలశౌరి వెంట వచ్చిన గరికిపాటి శివ కారణంగా తోపులాట జరిగింది. కార్యకర్తలకు చెప్పి, తోపులాటను ఆపేశాం'' అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇవీ చదవండి