Woman died in CM meeting: కృష్ణా జిల్లా పెడనలో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. సీఎం సభలో పాల్గొనేందుకు వచ్చిన పెడన మండలం పుల్లపాడు పంచాయతీ దేవరపల్లికి చెందిన సమ్మెట రత్నమాణిక్యం (64) సభాస్థలి సమీపంలో చనిపోయారు. భర్త, కుమారుడిని కోల్పోయిన ఆమె కోడలు, కూతురి వద్ద నివసిస్తున్నారు. పింఛనుపై ఆధారపడ్డ ఆమె గురువారం ముఖ్యమంత్రి కార్యక్రమం కోసం వెళ్లేందుకు ఏర్పాటుచేసిన వాహనంలో ఎక్కి ఉదయం పదింటికి సభ నిర్వహించే పార్కింగ్ స్థలం వద్దకు చేరుకున్నారు. ఆరోగ్యపరమైన వివిధ సమస్యలతో బాధపడుతున్న ఆమె ఎండవేడికి తట్టుకోలేక అక్కడే కుప్పకూలారు. ఫిట్స్‌లాగా వచ్చి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను సీఎం సభకు జనసమీకరణలో భాగంగా బలవంతంగా తీసుకురావడం వల్లే ప్రాణాలు కోల్పోయారని గ్రామస్థులు కొందరు వ్యాఖ్యానిస్తుండగా, సీఎంను చూడాలనే కాంక్షతోనే స్వచ్ఛందంగా వచ్చారని వాలంటీర్లు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మంత్రి జోగి రమేశ్, అధికారులు ఆమె కుటుంబీకులను పరామర్శించి రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. పెడన నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ మృతురాలి కుటుంబీకులను పరామర్శించి రూ.10వేల ఆర్థికసాయం ఇచ్చారు.
ఇవీ చదవండి: