కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు శ్రీ జ్ఞాన సాయి మందిరాన్ని... శిరిడి సాయి సేవా సంఘం ప్రధాన నిర్వాహకులు ఎలమంచిలి నాగమోహన్, లక్ష్మీకుమారి దంపతులు 13 ఏళ్ల క్రితం నిర్మించారు. మందిరం నిర్మించిన మూడేళ్ల తర్వాత గ్రామంలో ఆసరా లేనివారికి తమ వంతు సహాయం అందించాలని నిర్ణయించుకున్నారు. ఇంటింటికి అన్నదాన పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. గత పదేళ్లుగా 66 మంది వృద్ధులు, వికలాంగులు, అనాథలకు... రెండు పూటలా భోజన క్యారేజీలు పంపుతున్నారు.
ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. కరోనా కాలంలోనూ ఈ క్యారేజీల పంపిణీ కొనసాగించడం గమనార్హం. ఇంటిపక్కన ఉన్న వారిని ఎలా ఉన్నావు అని పలకరిస్తే కరోనా వస్తుందనే సంక్షోభంలో కూడా.... ప్రాణాలు పణంగా పెట్టి మానవ సేవే మాధవ సేవగా ముందుకు సాగుతున్నారు.
కేవలం అన్నదానంతో సరిపెట్టుకోకుండా గ్రామంలో ఆరోగ్య సమస్యలున్న వృద్ధులు, వికలాంగులకు వైద్య పరీక్షలు చేయించడం, ఎవరూ లేని వారికి ఆరు నెలలకొకసారి దుస్తులు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ దంపతులు నిర్వహించే అన్నదాన కార్యక్రమం పలువురికి ఆదర్శంగా మారింది. వీళ్లు చేస్తున్న సేవను పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆమె ట్రాక్టర్.. బతుకు మడిలోని కష్టాల్ని దున్నేసింది!