అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సిద్ధమైంది. పార్టీ నేతల అరెస్టులు, వైకాపా ఏడాది పాలనా వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన లాంటి అంశాలపై... అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టి నిరసన తెలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వకపోయినా, ప్రభుత్వం సరిగా స్పందించకపోయినా... అంశాల వారీగా నిరసన తెలపాలని భావిస్తోంది. అవసరమైతే వాకౌట్ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమావేశాల్ని బహిష్కరించాలన్న ప్రతిపాదనపై... తెలుగుదేశం శాసనసభాపక్ష భేటీలో చర్చ జరిగింది. సమావేశాలకు వెళ్లకుండా ఉంటే మంచిదని కొందరు, వెళ్లాల్సిందేనని మరికొందరు అభిప్రాయపడ్డారు.
మండలికి హాజరై, శాసనసభను బహిష్కరించి ‘మాక్ అసెంబ్లీ’నిర్వహించి నిరసన తెలిపితే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చ జరిగింది. అయితే శాసనసభ, మండలి విషయంలో వేర్వేరుగా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ ఉభయ సభల్ని బహిష్కరిస్తే... సెలెక్ట్ కమిటీకి పంపించిన సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లుల్ని అధికారపక్షం మళ్లీ ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో రెండు సభలకూ హాజరు కావాలనే నిర్ణయానికి వచ్చారు.
నల్ల చొక్కాలతో...
తెలుగుదేశం నేతలపై దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా అసెంబ్లీ జరిగినన్ని రోజులు నల్ల చొక్కాలతో హాజరు కావాలని చంద్రబాబు నిర్ణయించారు. పార్టీ నేతల అరెస్టుల అంశాన్ని లేవనెత్తటంతో పాటు ఇసుక, మద్యం, మైన్స్, భూముల్లో వైకాపా నేతలు కుంభకోణాలకు పాల్పడ్డారన్నది అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలకు సంబంధించిన 15 అంశాలపై అసెంబ్లీలో గళమెత్తాలని టీడీఎల్పీ ఓ అభిప్రాయానికి వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం దక్కకుంటే ప్రభుత్వంపై తమ నిరసన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని టీడీఎల్పీ భావిస్తోంది.
రెండు రోజులు సరికాదు
ప్రజా సమస్యలు, చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నందున... కరోనా పేరుతో అసెంబ్లీ సమావేశాల్ని రెండు రోజులకే పరిమితం చేయడం సరికాదని తెలుగుదేశం శాసనసభాపక్షం అభిప్రాయపడింది. తగిన జాగ్రత్తలు పాటిస్తూనే... కనీసం 10 నుంచి 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో డిమాండ్ చేయాలని నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చంద్రబాబుకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు..... శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి అరెస్టుల్ని ఖండించనున్నట్లు తెలుస్తోంది. ఏడాది పాలనలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, గనులు, ఇసుక, మద్యం, ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారనే అంశాల్ని ఎండగడతామని తెలుగుదేశం నేతలు స్పష్టంచేశారు. మండలికి సభ్యులు సరిగా హాజరుకాకపోతే... కోరం ఉన్న సమయాన్ని అదునుగా చేసుకుని ప్రభుత్వం కొన్ని బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునే అవకాశముందనే అంచనాకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో... సభ్యులంతా పూర్తి సమయం అందుబాటులో ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.
గవర్నర్‌కు ఫిర్యాదు
తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ... గవర్నర్‌కు తెలుగుదేశం ఫిర్యాదు చేయనుంది.
అచ్చెన్న భార్యకు పరామర్శ
టీడీఎల్పీ సమావేశంలోనే అచ్చెన్నాయుడు సతీమణిని చంద్రబాబు పరామర్శించారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డిభవాని... తాను తన పిన్ని వద్దకు వచ్చానని చెప్పటంతో జూమ్ యాప్ ద్వారానే అచ్చెన్నాయుడు భార్య యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు తర్వాత పార్టీ తమ కుటుంబానికి అండగా నిలిచిందంటూ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అక్రమ కేసులపై రాజీలేని పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పిన చంద్రబాబు... అచ్చెన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఇవీ చదవండి...