Water Problem In Nandigama: కృష్ణాజిల్లా నందిగామ పురపాలక సంఘంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల ప్రజలకు వారానికి ఒకరోజు మాత్రమే కొళాయి ద్వారా తాగునీరు అందుతుంది. అధికారులకు అభ్యర్ధిస్తే పది రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా పురపాలక అధికారులు తాగునీరు అందిస్తారు. కానీ అవి ఏ మూలకూ సరిపోవడం లేదంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తాగునీటి పథకం అభివృద్ధి, పైపులైను విస్తరణ పనుల కోసం రెండు ప్రభుత్వాల హయాంలో రెండు సార్లు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ముందుకు కదలడం లేదు. నిధులు విడుదల కాకపోవడమే పనుల జాప్యానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి తాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్లు కొందరి పట్టణ వాసుల తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి. పాత తాగునీటి పథకం ద్వారా కేవలం 40 శాతం మందికే నీరు అందుతోంది. మిగతా 60 శాతం మందికి తిప్పలు తప్పటం లేదు. ప్రధానంగా శివారు ప్రాంతాలైన డీవీఆర్, బీసీ కాలనీ, చెరువు బజార్, ముక్కుపాటి నగర్, రైతుపేట డౌన్ ప్రాంతాల్లో వారానికి ఒకసారి కొళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఆ నీరే వారం రోజులు దాచుకుని తాగాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో ఏఐబీ ప్రాజెక్టు తీసుకువచ్చాము. 89కోట్ల రూపాయలు పెట్టుబడితో పనులు ప్రారంభించాం. నిధుల జాప్యం కావటంతో పనులు తాత్కాలికంగా నిలిపివేశాము." -జయరామ్ ,నందిగామ పురపాలక కమిషనర్
ప్రస్తుతం నందిగామ పట్టణానికి రోజుకు 8 మిలియన్ లీటర్ల తాగునీరు అవసరమవుతుందని నందిగామ పురపాలక కమీషనర్ జయరామ్ తెలిపారు. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకే 89 కోట్ల రూపాయిల అంచనాతో మంచి నీటి సరఫరా వ్యవస్థకు టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. పనులు ముందుకు సాగ లేదంటూ 2021లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. రెండు ప్యాకేజీలుగా 89 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. నిధులు మంజూరు కాకపోవటంతో పనులు తాత్కాలికంగా నిలిపివేశారని పురపాలక కమీషనర్ వెల్లడించారు.
"తాగునీటి సమస్యతో నిత్యం సతమతం అవుతున్నాము. వారానికి ఒకసారి కొళాయి వస్తుంది. అప్పుడేే ఇంటి అవసరాలకు సరిపడా నీళ్లు పట్టుకుని వారం మెుత్తం ఉపయోగించుకుంటాము. అధికారులతో చెప్తే ఎప్పుడో ఒకసారి ట్యాంకర్ వస్తుంది. అధికారుల సమస్య ఏదైనప్పటికీ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా నిధులు విడుదల చేసి నీటి సమస్యను పరిష్కరించాలి." -స్థానికులు
Water Problem in Guntur: అధికారుల ప్రణాళికా లోపం.. ప్రజలకు శాపం..