VOTERS ARE MORE THAN IN 63 CONSTITUENCIES : రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం నవంబరు 9 నాటికి రాష్ట్రంలో 3 కోట్ల 98లక్షల54 వేల93 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. అయితే 63 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య అసాధారణంగా ఉండటం పలు అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని జనాభాతో పోలిస్తే ఉండాల్సిన ఓటర్లు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు.
2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుత జనాభా అంచనాలను బట్టి ఎన్నికల సంఘం ఎలెక్టోర్ టూ పాపులేషన్ రేషియోను 724గా లెక్క కట్టింది. ఏ నియోజకవర్గంలోనైనా ఈఆర్ నిష్పత్తికి కొంచెం అటు, ఇటుగా ఓటర్లు ఉంటే పర్వాలేదు. కానీ 20 నియోజకవర్గాల్లో ప్రతి వెయ్యి జనాభాకు 800 మందికి పైగా ఓటర్లు ఉండగా, మరో 43 నియోజకవర్గాల్లో 750 మందికి పైగా ఉన్నారు.
జనాభాతో పోలిస్తే ఏడు జిల్లాల్లో 63 నియోజకవర్గాల్లో ఓటర్ల నిష్పత్తి అసాధారణంగా ఉంది. కృష్ణా జిల్లాలో వెయ్యిమంది జనాభాకు 787, పశ్చిమగోదావరి జిల్లాలో 778, బాపట్ల జిల్లాలో 770, పల్నాడు జిల్లాలో 769 మంది ఓటర్లు ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 766 మంది, శ్రీకాకుళం జిల్లాలో 759 మంది, విజయనగరం జిల్లాలో 757 మంది ఉండటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటూ.. ఓటర్ల నమోదు సహా అన్నింటా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు ఇప్పటికే ఫిర్యాదు చేశాయి. 63 నియోజకవర్గాల్లో అసాధారణంగా ఓటర్లు ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరపాలని డిమాండు చేస్తున్నాయి. అయితే జనాభాతో పోలిస్తే ఉండాల్సిన ఓటర్లు అసాధారణంగా ఉన్న నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేకంగా పరిశీలించేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించామని ప్రధాన ఎన్నికల అధికారి M. మీనా తెలిపారు.
ఇవీ చదవండి: