VOA Nagalakshmi suicide : వైకాపా నాయకుల ఒత్తిళ్లకు పోలీసులు ఎంతలా తలొగుతున్నారో, వాళ్లు చెబితే లైంగిక వేధింపుల ఫిర్యాదులపై కూడా కేసు కట్టకుండా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి... కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి వీవోఏ నాగలక్ష్మి ఆత్మహత్య ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. మంత్రి అనుచరుడైన వైకాపా గ్రామస్థాయి నాయకుడు గరికపాటి నరసింహారావు లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారని,... దుర్భాషలాడుతూ, ప్రభుత్వ కార్యాలయంలోనే దాడికి ప్రయత్నించారని ఫిబ్రవరి 24నే బందరు తాలూకా పోలీసుస్టేషన్‌లో నాగలక్ష్మి ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎస్సై, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు ఆ నాయకుడి ఒత్తిళ్లకు తలొగ్గారని భావించి... ఈ నెల 14న స్పందన కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. అయినా కూడా ఎలాంటి ఫలితం కనిపించలేదు. మూడు రోజుల పాటు ఆ ఊసే ఎత్తలేదు. ఎస్పీనే న్యాయం చేయకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలని ఆవేదన చెందిన నాగలక్ష్మి... ఈ నెల 16న పురుగుల మందు తాగారు. 17న ప్రాణాలు కోల్పోయారు.
అప్పటివరకూ నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదు?
నాగలక్ష్మి ప్రాణాలతో ఉన్నప్పుడు ఫిర్యాదుపై చర్యలు తీసుకోని పోలీసులు... బలవన్మరణానికి పాల్పడిన తర్వాత విమర్శలు వెల్లువెత్తటంతో ఒక్కసారిగా హడావుడి చేశారు. స్పందనలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నెల 16వ తేదీన కేసు నమోదు చేసినట్లు... శుక్రవారం మీడియాకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు. నిందితుడ్ని అరెస్టు చేశామంటూ... అతన్ని వెనుక నిలుచోబెట్టి ముందువరుసలో డీఎస్పీ మొదలుకుని కిందిస్థాయి సిబ్బంది వరకూ కూర్చొని ఫోటోలు తీసుకున్నారు. వాటినీ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. పోలీసులు చెబుతున్నట్లు 16నే కేసు నమోదు చేసుంటే... అదే రోజు నిందితుడ్ని ఎందుకు అరెస్టు చేయలేదనే ప్రశ్న తలెత్తుతోంది. స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని బాధితురాలికి ఎందుకు చెప్పలేదన్నదీ తెలియదు. ఫిబ్రవరి 24న నాగలక్ష్మి చేసిన ఫిర్యాదుపై నరసింహారావుకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని పోలీసులు శుక్రవారం నాటి ప్రకటనలో తెలిపారు. లైంగిక వేధింపులపై ఓ మహిళ ఫిర్యాదు చేస్తే... కేసు నమోదు చేసి, నిందితుడిపై చర్యలు తీసుకోకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం ఏమిటన్నది అంతుచిక్కని విషయమే. దిశ యాప్ తెచ్చామని, మహిళలపై నేరాల విషయంలో తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పే ఉన్నతాధికారులు... ప్రభుత్వంలో పనిచేసే ఓ మహిళ తనపై జరుగుతున్న లైంగిక వేధింపుల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవటం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గ్రామస్థాయి వైకాపా నాయకుడైన గరికపాటి నరసింహారావు కోసం... అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు కలిసి తన సోదరిని హత్య చేశారని నాగలక్ష్మి సోదరుడు భోగాది వినయ్‌బాబు ఆరోపించారు.
కోర్కె తీర్చాలని వేధించారు..
కోరిక తీర్చాలంటూ వైకాపా నాయకుడు గరికపాటి నరసింహారావు వేధించినట్లు... ఈ నెల 14న ఎస్పీ సిద్దార్థ కౌశల్‌కు ఇచ్చిన ఫిర్యాదులో నాగలక్ష్మి పేర్కొన్నారు. ఫిర్యాదు పత్రంలో రాయడానికి వీల్లేనంత అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు వాపోయారు. తనవైపు వంకరగా చూస్తూ, అసభ్యంగా మాట్లాడారని... ఆ విషయాలు ఇంట్లో వాళ్లకి చెబితే కాపురం దెబ్బతింటుందని, ఉద్యోగం చేయనివ్వరని ఆందోళన చెందినట్లు చెప్పారు. సన్నిహితులైన అనిశెట్టి లంకమ్మ, మోకా జీవన్‌బాబు సహా మరికొందరికి తన బాధలు చెప్పుకోగా,... జనవరి 26న నరసింహారావును మందలించినట్లు వివరించారు. ఆ తర్వాతి నుంచి వేధింపులు మరింత తీవ్రమయ్యాయని ఆవేదన చెందారు. వెలుగు కార్యాలయంలో జరిగిన గొడవలో... అతడి భార్య ముందే ఎప్పటికైనా నిన్ను అనుభవించి తీరతానంటూ నరసింహారావు హెచ్చరించారని నాగలక్ష్మి వాపోయారు. నరసింహారావు నుంచి ప్రాణభయం ఉందని... ఫిబ్రవరి 24న తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వీవోఏ నాగలక్ష్మిది ఆత్మహత్య కాదు.. వైకాపా నేత చేసిన హత్య: లోకేశ్