Village Secretariats and RBKs Works Stopped: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు చెబుతున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ భవనాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వివిధ దశల్లో నిలిచి పోయాయి. గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని విపక్షాల నేతలు చెబుతున్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ నియోజకవర్గంలో నూతన సచివాలయాల నిర్మాణం, రైతు భరోసా కేంద్రం పనులు నిలిచిచిపోయాయి.
అవసరం లేకున్నా పెడన నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎక్కువ సంఖ్యలో సచివాలయాల నిర్మాణాలు చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు.. ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం పూర్తి కాలేదు. మధ్యలో నిలిచిపోయిన భవనాల వద్ద ఇసుక, కంకర మాయం అవుతుండగా.. ఐరన్ తుప్పు పట్టిపోతుంది. గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం లేక ఇబ్బందులు పడుతున్నామని మల్లేశ్వరం గ్రామ ప్రజలు చెబుతున్నారు.
గుత్తేదారుల నుంచి కమీషన్లు రావడం లేదని బిల్లుల చెల్లింపులు నిలిపివేయడంతో.. నిర్మాణాలు కొనసాగించలేనని గుత్తేదారు ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం ఆసంపూర్తిగా ఉన్న ఈ నిర్మాణాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. చీకటి పడితే మందుబాబుల మద్యం సేవిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదేమని అడిగితే దాడులకు తెగబడుతున్నారని వాపోతున్నారు.
మల్లేశ్వరంలో పంచాయతీ కార్యాలయం పటిష్టంగానే ఉండేదని.. కానీ సచివాలయం నిర్మాణం పేరుతో చక్కగా ఉన్న పంచాయతీ భవనాన్ని అన్యాయంగా కూల్చి వేశారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దాదాపు 25 లక్షల రూపాయలతో నూతన సచివాలయం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి మంత్రి జోగి రమేష్ శంకుస్థాపన చేశారని చెప్పారు. భవనాల నిర్మాణానికి సంబంధించి నిర్మాణ పనులు ఇచ్చేందుకు సదరు గుత్తేదారు నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.
rythu bharosa kendram: చెప్పేవన్నీ గొప్పులు.. ఆర్బీకేల్లో రైతులకు అందని సేవలు
సచివాలయ భవనం దాదాపు 70 శాతం పూర్తయింది. చేసిన పనులకు సంబంధించి బిల్లులు మంజురు చేయమని అడుగుతుంటే వాటికి కూడా కమీషన్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా అప్పులు చేసి పనులు చేశామని, ఇంకా కమీషన్లు ఇవ్వాలంటే తమ వల్ల కాదని గుత్తేదారులు తమ వద్ద అవేదన వ్యక్తం చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ నాయకులకు కమీషన్లు ఇవ్వలేక గుత్తేదారులు పనులు నిలిపివేశారని అన్నారు.
పంచాయతీ భవనాన్ని కూల్చి వేసి ప్రస్తుతం మల్లేశ్వరం పంచాయతీ కార్యాకలాపాలను పాతబడిన జలవనరుల శాఖ విడిది కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఆ విడిది కార్యాలయం కూడా ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. విపక్ష పార్టీల నేతలకు నీతులు చెప్పే మంత్రి జోగి రమేష్ సొంత నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని విపక్ష నాయకులు సూచిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణ జిల్లాలో ఇలానే వందల సంఖ్యలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆసంపూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలకు సచివాలయాలు ద్వారా మంచి పాలన అందిస్తున్నామని గొప్పలు చెప్పడం ఇదేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన ప్రజా ప్రతినిధులు కమీషన్ల కోసం పనులు అగిపోయేలా చేయడం సరికాదని ప్రజలు అంటున్నారు.
High Court: పంచాయతీలుండగా..గ్రామ సచివాలయాలు ఎందుకు?