నగరంలోని రహదార్లపై ఉంటూ, అక్కడే నిద్రిస్తూ.. చలికి ఇబ్బందులు పడుతున్న అనాథలు, నిరాశ్రయులను గుర్తించి ఆవాస కేంద్రాలకు తరలించేందుకు నగరపాలక సంస్థ యూసీడీ విభాగం అధికారులు శనివారం రాత్రి నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ ప్రక్రియను కొద్దిరోజుల పాటు కొనసాగించేందుకు నిర్ణయించారు.
సోషల్ వర్కర్లు, సీవోలకు బాధ్యతలు
నగరంలోని నిరాశ్రయులను గుర్తించే బాధ్యతలను యూసీడీ విభాగంలోని సోషల్ వర్కర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లకు అప్పగించారు. వీరు రాత్రిపూట 9 గంటల నుంచి 10.30 గంటల వరకు నగరంలోని రహదార్లు, జంక్షన్లు, ఫుట్‌పాత్ ప్రాంతాలు, వీధుల్లోనూ పర్యటించి స్థానికంగా గుర్తించిన వారిని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని వసతి కేంద్రాలకు తరలించనున్నారు.
ప్రజలూ చెప్పొచ్ఛు
నగర ప్రజలు సైతం నగరంలోని ఏ ప్రాంతంలోనైనా అనాథలను గుర్తించిన పక్షంలో ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. హనుమాన్‌పేట నిరాశ్రయుల భవనం సీవో ఎం.నాగరాజు (9603192978), రాణిగారితోట సీవో నాగలక్ష్మి (8008201536), రామరాజ్యనగర్ సితార జంక్షన్‌లోని సీవో వెంకటేష్, హనుమాన్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలోని కేంద్రం సీవో కిరణ్ మహేష్ (9032066642) లకు ఫోన్ చేస్తే వారు సిబ్బందిని పంపి అనాథలకు ఆశ్రయం కల్పిస్తారు.
నిత్యం సమాచారం ఇవ్వాలి
ఈ సందర్భంగా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగం ప్రాజెక్టు అధికారి జె.అరుణ మాట్లాడుతూ ప్రత్యేక డ్రైవ్‌ను వచ్చేనెల 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. సోషల్ వర్కర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు రోజువారీ తమ పరిధిలో గుర్తించిన నిరాశ్రయుల వివరాలను ఎప్పటికప్పుడు ఫొటోలతో సహా తమకు పంపాలని ఆదేశించారు.
ఇవీ చూడండి...