విదేశాల్లో ఉద్యోగం పేరిట ఒక యువకుడి నుంచి రూ.2.5 లక్షల మేర మోసం చేసిన సైబర్ నేరస్థుల నుంచి 73వేల రూపాయల నగదును సైబర్ క్రైం పోలీసులు తిరిగి ఇప్పించారు. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఆకురాతి సుధీర్ ఆన్‌లైన్‌లో ఉద్యోగాల కోసం వెతుకుతూ ఒక సైట్‌లో పేరు నమోదు చేసుకున్నారు. 2019 డిసెంబరు నెలలో ఆయనకు సీనియర్ హైవే ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చినట్లు మెయిల్ వచ్చింది. ఇంటర్వ్యూ, వీసాల నిమిత్తం నగదు పంపమనడంతో ఆయన వారు పంపిన బ్యాంకు ఖాతాకు 36వేల రూపాయలు జమ చేశారు. మరోసారి విదేశీ బ్యాంకులో ఖాతా తెరవాలంటూ 78వేల రూపాయలు వసూలు చేశారు. ఆ తరువాత సెక్యూరిటీ డిపాజిట్ కోసమని లక్ష, జీఎస్టీ నిమిత్తం 40వేల నగదు సదరు బ్యాంకు ఖాతాకు సుధీర్ పంపించారు. ఇలా దాదాపు 2.5 లక్షల రూపాయలు వసూలు చేసిన తరువాత సదరు కంపెనీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
మోసపోయినట్లు గ్రహించిన సుధీర్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దానిపై శోధించారు. నగదు జమ చేసిన ఖాతా ఝార్ఖండ్‌లోని ఒక ప్రైవేటు బ్యాంకులో ఉన్నట్లు గుర్తించారు. సదరు బ్యాంకు అధికారులతో మాట్లాడి ఆ ఖాతా లావాదేవీలను నిలిపివేశారు. ఆ తరువాత బ్యాంకు అధికారులతో చర్చించి దానిలో ఉన్న 73 వేల రూపాయలను తెప్పించి సుధీర్‌కు అందజేశారు.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ లావాదేవీలు..రూటుమార్చిన సైబర్ నేరగాళ్లు