విజయవాడ, గుంటూరుల్లోని యువతులు, మహిళల కోసం ప్రత్యేక మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలను రూపొందించారు. మూలపాడు అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్, ఆర్చరీ, టీం బిల్డ్ సెషన్స్, సర్వైవల్ స్కిల్స్, ఆత్మరక్షణ విద్యలు లాంటివి నేర్పిస్తున్నారు. తాజాగా ఆదివారం నుంచి ఈ అతివల సాహస కార్యక్రమాలను ప్రారంభించారు. మొదటి రోజు 25 మంది యువతులకు తర్ఫీదు ఇచ్చారు.
కొండపల్లి అటవీ ప్రాంతంలోని మూలపాడులో తొలి రోజు అతివలందరితో కలిసి ట్రెక్కింగ్ నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అటవీ ప్రాంతంలోని కొండలు, జలపాతాల వద్ద ఆహ్లాదకరంగా గడిపారు. ప్రతి నెలా మొదటి, మూడో శని, ఆదివారాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వీఏసీ ప్రతినిధులు తెలిపారు. తొలి రోజు కావడంతో కేవలం ట్రెక్కింగ్ వరకే నిర్వహించామని, వచ్చే వారం నుంచి పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. మొదటి రోజు విజయవాడ, గుంటూరుల్లోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థినులతో పాటు, ఉద్యోగినులు, గృహిణులు పాల్గొన్నారు.
మానసిక, శారీరక ఆరోగ్యంతో..
మహిళలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నది తమ ప్రధాన ఉద్దేశమని వీఏసీ వ్యవస్థాపకులు సురేష్ కలువ, రఘునాథ్‌రెడ్డి వెల్లడించారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా నెలలో కనీసం ఓ నాలుగు రోజులు వీఏసీ తరఫున కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే తాము నిర్వహించే కార్యక్రమాల్లో పురుషులతో సమానంగా యువతులు పాల్గొంటున్నారన్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ఎవరైనా పాల్గొనొచ్చని తెలిపారు. వివరాల కోసం తమ వీఏసీ ఫేస్‌బుక్ పేజ్‌లో, ఫోన్ నంబరు: 9700980080లో సంప్రదించాలని సూచించారు.
ఇవీ చూడండి...
' చదవడం మాకిష్టం'.. విద్యార్థుల్లో పుస్తక పఠనం పెంచడమే లక్ష్యం