కృష్ణా జిల్లా ఉయ్యూరు జడ్పీటీసీ సభ్యురాలు యలమంచిలి పూర్ణిమ (వైకాపా) మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు చెబుతున్నా.. పార్టీలో అంతర్గతపోరు, ఆధిపత్యమే కారణమని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఉయ్యూరు జడ్పీటీసీ స్థానానికి పార్టీ పూర్ణిమను అభ్యర్థినిగా నిర్ణయించింది. వైకాపాలోని మరోవర్గం వేరే మహిళను పోటీకి దించాలని ప్రయత్నించింది. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి జోక్యంతో విరమించుకుంది. నాటి నుంచే ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఇదే మండలంలోని కాటూరు-2 ఎంపీటీసీ సభ్యురాలిగా పూర్ణిమకు బంధువు అయిన తెదేపా అభ్యర్థిని సజ్జా అనూష విజయం సాధించారు.
అక్కడ వైకాపా అభ్యర్థిని ఓడిపోవడానికి పూర్ణిమ కారణమంటూ ఆ పార్టీలోని ప్రత్యర్థి వర్గం ఆరోపించింది. నాడు ఎమ్మెల్యే పార్థసారథి ఇరు వర్గాల మధ్య సర్దుబాటు చేశారు. ఇటీవల కాలంలో జడ్పీటీసీ సభ్యురాలికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయమై పూర్ణిమ భర్త కోటయ్య చౌదరి 'ఈనాడు'తో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతోనే తన భార్య రాజీనామా చేశారని, తమ పిల్లల చదువు, బాగోగులు చూసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. పూర్తిగా రాజకీయాల నుంచే వైదొలుగుతామని, ఏ పార్టీలోనూ చేరే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి