TRS attack on MP Arvind : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనంపై తెరాస శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఈ దాడిలో భాజపా ఎంపీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్తుండగా ఆర్మూర్ మండలం ఇస్సపల్లిలో ఈ ఘటన జరిగింది. తెరాస శ్రేణుల దాడికి నిరసనగా భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ముందే చెప్పినా
తెరాస శ్రేణులను పోలీసులే రెచ్చగొడుతున్నారని అర్వింద్ ఆరోపించారు. రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి తమను అడ్డుకున్నారని విమర్శించారు. దాడి సమాచారాన్ని పోలీసులకు ముందే చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస శ్రేణులను అడ్డుకోవాలంటూ ఆర్మూర్‌లో ధర్నా కూడా చేసినట్లు చెప్పారు. తన కారుపై తెరాస శ్రేణులు రాళ్లతో దాడి చేశారని సీపీకి ఎంపీ అర్వింద్ ఫిర్యాదు చేశారు. ఘటనపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
పోలీసులు తెరాస తొత్తులుగా మారారు
'మమ్మల్ని అక్కడ ఉంచి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నామని చెప్పి పోలీసు వాళ్లే తెరాస వాళ్లను మేము ఉన్నచోటికి పిలిపించారు. రాళ్లు, కత్తులతో దాడి చేశారు. నా కారు అద్దాలు పలిగిపోయాయి. కత్తులతో దాడి చేశారు. ఇనుప గుండ్ల లాంటి వాటితో మా కార్యకర్తలను కొట్టారు. భాజపాని అటాక్ చేయాలని పోలీసులను తెరాస వాడుకుంటోంది. పోలీసులు తెరాస తొత్తులుగా మారారు. ఫిర్యాదు చేయడానికి దాడి జరిగిన ఘటన నుంచి సీపీ ఆఫీస్‌కు వచ్చా. ఇక్కడ ఒక్క అధికారి లేడు. సీపీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. సీపీ వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఫోన్ చేస్తే... నేను ఏం చేయలేను సర్ అని అన్నాడు.' - అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
ఖండించిన భాజపా నేతలు
ఎంపీ అర్వింద్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ చేశారు. ఎంపీ అర్వింద్ వాహనంపై దాడి ఘటన గురించి ఆరా తీశారు. దాడి ఘటనను ఎంపీ వివరించారు. ఎంపీ అర్వింద్‌పై దాడిని పార్టీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే రాజా సింగ్ ఖండించారు. ఎంపీ కారు అద్దాలు పగులగొట్టి హత్యాయత్నానికి పాల్పడిన తెరాస కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. పోలీసు యంత్రాంగం సాక్షిగా దాడి జరుగడం దారుణమని... ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులకు తెరాస ప్రోత్సహించడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఇలాంటి దాడులకు భాజపా భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. భయపెట్టాలని తెరాస భావిస్తే మరింత ఉద్ధృతంగా తెరాస ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు.
ఇదీ చదవండి : Minister Sidiri Appalaraju: వైకాపా నేతల మాట వినకపోతే ఇక అంతే... మంత్రి సీదిరి వ్యాఖ్యలు