Traffic Joint Commissioner Ranganath on New Traffic Rules: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా విధించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. నిబంధనల ఉల్లంఘనపై ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ రంగనాథ్ పలు కీలక సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులలో కొత్త రవాణా నిబంధనలపై అవగాహన కొరకు ఈనెల 28 నుంచి ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జాయింట్ సీపీ తెలిపారు.
ఏ వాహనం వల్ల ఎక్కువ విధ్వంసం జరిగేందుకు అవకాశం ఉంటుందో.. అలాంటి వాహనాలు నిబంధనలు అతిక్రమిస్తే ఎక్కువ మొత్తంలో జరిమానా విధించాలని నిర్ణయించామని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రాంగ్ రూట్‌లో రావడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్న రంగనాథ్.. అందుకే ఇలాంటి సందర్భాల్లో నిబంధనలు పాటించని వాహనాలకు పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తున్నామన్నారు.
'ఈనెల 28 నుంచి ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్. జీవో ప్రకారమే కొత్త రవాణా నిబంధనలు అమలు చేస్తాం. రాంగ్‌రూట్, ట్రిపుల్ రైడింగ్‌లపై జరిమానాలు పెంచుతున్నాం. ఇకపై రాంగ్‌రూట్ డ్రైవింగ్‌కు రూ.1700 జరిమానా. ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200 జరిమానా. రాంగ్‌రూట్ డ్రైవింగ్ వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రిపుల్ రైడింగ్ కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్డు ప్రమాదాల నివారణే మా లక్ష్యం. ఆదాయం కోసమే జరిమానాలు వేస్తున్నామనేది అవాస్తవం. యూ టర్న్‌లపై మేం కూడా పునఃసమీక్షిస్తాం. తరచూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక చర్యలు.'- రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్
పోలీసులు, ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ అన్నారు. ప్రభుత్వం పోలీసు శాఖకు రూ.వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తోందన్న ఆయన.. ట్రాఫిక్ చలాన్లను ఆదాయ వనరుగా ఎప్పుడూ మేం పరిగణించలేదని పేర్కొన్నారు. కేవలం చలాన్ల మీదనే పోలీసులు దృష్టి పెడుతున్నారని చాలా మంది భావిస్తున్నారన్న రంగనాథ్.. అది సరైంది కాదని తెలిపారు.
నగరంలో చాలా ప్రాంతాల్లో చూస్తున్నాం... ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు.. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడేందుకు అవకాశం ఉంటుందని సీపీ రంగనాథ్ వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు చలాన్ వేస్తామన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగానే ఇదంతా చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ‘ఆపరేషన్ రోప్’ను ప్రారంభించామని పేర్కొన్నారు. వాహనదారుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నగరంలో కావాల్సిన చోట్ల యూ టర్న్‌లు ఏర్పాటు చేసే విషయంలో సమీక్ష చేస్తున్నామని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.
ఇవీ చదవండి: