Traffic Challan Cyber Fraud : ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు పోలీసులు చలానాలు విధిస్తుంటారు. ఫొటోలు చిత్రీకరించి ఆన్‌లైన్‌లోనే సంబంధిత వాహన యజమానికి ఈ-చలానా జారీ చేస్తారు. సైబర్ మోసగాళ్లు ( Cyber fraudsters ) వీటిని కూడా వదలడం లేదు. వాహన యజమానులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ-చలానాల పేరుతో వల వేస్తూ వాహనదారులను దోచుకుంటున్నారు.
CYBER FRAUD: కొత్త పంథాలో సైబర్ నేరగాళ్లు... స్క్రీన్ షేరింగ్ యాప్స్ పేరుతో..!
విజయవాడకు చెందిన ఓ యువకుడి మొబైల్‌కు ఇటీవల రికార్డు చేసిన వాయిస్ వచ్చింది. చలానా చెల్లించాలన్నది దాని సారాంశం. వెంటనే ఓ మెసేజ్ ( SMS ) కూడా వచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘించినందుకు వెయ్యి రూపాయలు చెల్లించేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి అని ఉంది. నిజమని నమ్మిన యువకుడు... చలానా మొత్తం చెల్లించేందుకు ఆ లింక్‌పై క్లిక్ చేశాడు. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి తన ఖాతా నుంచి ఆ మొత్తాన్ని బదిలీ చేశాడు. తర్వాత కొద్దిసేపటికే తన ఫోన్‌కు వచ్చిన మెసేజ్ ( SMS )లు చూసి నిర్ఘాంతపోయాడు. తన ప్రమేయం లేకుండానే విడతలవారీగా లక్షా పదిహేను వేల రూపాయలు పోయినట్లు గుర్తించాడు.
CYBER CRIME: పోలీసులకు పెనుసవాల్‌గా సైబర్ నేరాలు
ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) వాడే అసలు చలానా ఫార్మాట్‌ను పోలిఉండేలా సైబర్ కేటుగాళ్లు మెసేజ్ లు పంపిస్తున్నారు. మీ వాహనంపై చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. ఆర్టీఓ కార్యాలయానికి కూడా వెళ్లి మీ చలానా చెల్లించవచ్చు అని మెసేజ్‌ల్లో ఉంటుంది. ఈ సంక్షిప్త సందేశాలు చూసి చాలా మంది చలానాలకు సంబంధించి అలర్ట్ వచ్చిందని నమ్మి మోసపోతున్నారు. అలా నమ్మించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నేరగాళ్లు. రికార్డెడ్ వాయిస్ సందేశాలు కూడా ఫోన్ వినియోగదారులకు వస్తున్నాయి. నిజమే అని నమ్మి మెసేజ్‌లోని నకిలీ వెబ్‌సైట్ లింక్ ( Website link ) పై క్లిక్ చేస్తే మన ఫోన్ రక్షణ విషయంలో మీరు రాజీ పడినట్లే. దీంతో పాటు క్రెడిట్, డెబిట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ( Internet banking ) ఖాతా వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్తాయి. మన మొబైల్‌కు వచ్చే నకిలీ సంక్షిప్త సందేశాలను నిశితంగా చూస్తే....అసలు, నకిలీకి మధ్య ఎన్నో వైరుధ్యాలు కనిపిస్తాయి. వీటిపై అవగాహన ఉంటే మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు.
CYBER CRIME : విద్యుత్ బిల్లు చెల్లించాలంటూ సందేశం.. నమ్మి ఫోన్ చేస్తే..
ఇలా గుర్తించండి.. చలానాలు చెల్లించాలంటూ వ్యక్తిగత నెంబర్ల నుంచి ఎట్టిపరిస్థితుల్లో మెసేజ్‌లు రావు. మెసేజ్ లింక్‌లలో వచ్చే వెబ్‌సైట్ చిరునామా చివర .in అని ఉంటే నకిలీ సైట్‌గా గుర్తించాలి. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చివర .GOV.in అన్న అక్షరాలు ఉంటాయని గుర్తించాలి. నకిలీ ఈ-చలానా (E-challan)లో వ్యక్తిగత వివరాలేవీ ఉండవు. డబ్బు చెల్లించమని నకిలీ సైట్ తాలూకూ లింక్ మాత్రమే ఉంటుంది. అసలు చలానాలో అయితే.. వాహనం రిజిస్ట్రేషన్, యజమాని పేరు, ఇంజిన్, ఛాసిస్ నెంబర్లు, ఉల్లంఘన వివరాలు కూడా ఉంటాయి. మన పేరుతో ఎన్ని చలానాలు ఉన్నాయి... ఎంత మొత్తం చెలించాల్సి ఉంది... ఏయే ఉల్లంఘనలు నమోదు అయ్యాయి.. వంటి వివరాలను వాహనదారులు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూసుకోవచ్చు. అందులోనే చలానా చెల్లించే అవకాశం ఉంది. అసలు వెబ్‌సైట్ ఇదీ https://echallan.parivahan.gov.in అని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
రోడ్డు మీద అడిగిన వారికి ఫోన్ ఇస్తున్నారా.. అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే!