అమ్మితే కోత... కొనాలంటే మోత... ఇదీ కృష్ణాజిల్లాలోని టమాటా రైతుల పరిస్థితి. తాము టమాటా సాగు చేసిన సమయంలో మంచి దిగుబడులు వచ్చినా.... ధరలు లేక కనీసం కూలీ ఖర్చులూ మిగల్లేదని... ఇప్పుడు టమాటా కొనాలంటే వంద రూపాయలకు మించి ధరలున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణాజిల్లా మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లోని మెట్ట భూముల్లో రైతులు ఎక్కువగా టమాటా పంటను పండిస్తారు. ఏటా అక్టోబరు నుంచి మే నెల వరకు ఈ పంటను సాగు చేస్తారు. ఇక్కడ పండిన టమాటాను మచిలీపట్నం, గుడివాడ, చల్లపల్లి, విజయవాడ, హైదరాబాద్‌లోని మార్కెట్లకు పంపిస్తారు. ఈ ప్రాంతంలో దిగుబడులు వచ్చేసరికి కేజీ టమాటా ఐదు రూపాయలు కూడా ఉండట్లేదు. ప్రతి సంవత్సరం ఇలానే రైతులు నష్టపోతూనే ఉన్నారు.
"ఎటువంటి టమాటా వెయ్యాలో రైతులకు అవగాహన కల్పించాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండే టమాటాను వేయాలని రైతుల్ని ప్రోత్సహించాలి. టామాటాల నిల్వ కోసం రైతులకు కోల్డ్ స్టోరేజ్‌లను ప్రభుత్వం కట్టింటాలి. ధర ఎక్కువ ఉన్నప్పుడు రైతులు అమ్ముకునేలా ఉంటే రైతుకు గానీ వినియోగదారులకు గానీ నష్టం రాకుండా ఉంటుంది."
-ఓ రైతు, కృష్ణా జిల్లా
అకాల వర్షాలకు ఈ ఏడాది టమాటా పంట దెబ్బతింది. ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశాన్నంటుతుండటం వల్ల... కొనలేని పరిస్థితి నెలకొందని రైతులు అంటున్నారు. ధరలు లేనప్పుడు... దళారులకు తక్కువ రేట్లకే అమ్ముకుని... చేల్లలోనే పంటను వదిలేశామని... శీతల గిడ్డంగుల్లో టమాటాను నిల్వ చేసే అవకాశం ఉంటే... తాము నష్టపోయేవాళ్లం కాదంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సరకుపై ఆధారపడటంతో... ధరలు పెరిగాయని రైతులు పేర్కొన్నారు.
టమాటా దిగుబడులు బాగున్నప్పుడు.. నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించాలని, రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చదవండి: రూ.100 దాటి పరిగెడుతున్న.. టమాటా ధర!