కరోనా నిరోధక టీకా వేయించుకోని సామాజిక పింఛనుదార్లకు సొమ్ము చెల్లింపును ఆపేయడం వివాదాస్పదమైంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరు, కాసరనేనివారిపాలెం గ్రామస్థులు అందజేసిన వివరాల ప్రకారం వ్యాక్సిన్ వేయించుకోని లబ్ధిదారులకు పింఛను నగదు చెల్లింపు జరగదని గ్రామ వాలంటీర్ల నుంచి గురువారం ఫోనులో సంక్షిప్త సందేశం వచ్చింది. దానికి అనుగుణంగానే ఉదయాన్నే ఇంటికి వచ్చి పింఛను సొమ్ము ఇచ్చే వాలంటీర్లు సాయంత్రం వరకూ రాలేదు. ఈలోగా ‘రేపు (2వతేదీ శనివారం) వ్యాక్సిన్ వేయించుకున్న వారికి పింఛన్ ఇస్తామని’ మరో సంక్షిప్త సందేశం వచ్చింది.
అసలేమి జరిగిందంటే: గురువారం జరిగిన మండల సమీక్ష సమావేశంలో వివిధ కారణాలు చెబుతూ వ్యాక్సిన్ వేయించుకోవడం లేదని కార్యదర్శులు, వీఆర్వోలు, వైద్యఆరోగ్య సిబ్బంది చెప్పారు. కొందరు ప్రజాప్రతినిధులు ‘టీకా వేయించుకోని వారికి పథకాలు ఆపేస్తామని’ చెబితే ఫలితం ఉంటుందని సూచించారు. దీంతో మద్దూరు గ్రామ పంచాయతీ, సచివాలయ అధికారులు, సిబ్బంది అత్యుత్సాహంతో వాలంటీర్ల ద్వారా పైవిధంగా సంక్షిప్త సమాచారాలు పంపారు. అలాగే శుక్రవారం పింఛను సొమ్ము చెల్లించలేదు. దీనిపై ఎంపీడీవో అనూరాధ మాట్లాడుతూ కరోనా కట్టడిపై చర్చలో కొందరు సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాల మేరకు మద్దూరు అధికారులు ఇలా స్పందించి ఉంటారని, శనివారం పింఛను అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఇదీ చదవండి: PROTEST FOR PENSIONS: పింఛన్లు పునరుద్ధరించాలంటూ.. వృద్ధుల నిరసన