సూర్యగ్రహణం కారణంగా తిరుపతిలోని పలు ఆలయాలను తితిదే అధికారులు మూసివేశారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీగోవిందరాజస్వామి, శ్రీకోదండరామ స్వామి, శ్రీనివాసమంగాపురం శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు మరికొన్ని ఆలయాలను మూసివేశారు. బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయాల తలుపులు మూసి ఉంచుతామని అర్చకులు తెలిపారు. గ్రహణ అనంతరం ఆలయ తలుపులు తెరిచి శుద్ది, పుణ్యాహవచనం నిర్వహించి భక్తులకు మధ్యాహ్నం 2 గంటల తరువాత ఆలయాల దర్శన భాగ్యం కల్పించనున్నారు.
ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గ అమ్మవారి గుడి అంతరాలయం, ప్రధాన ద్వారాలను పూజారులు, అధికారులు మూసివేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసరావు పూజలు నిర్వహించి ఆలయాన్ని శాస్త్రోక్తంగా మూసివేశారు. దుర్గగుడిలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. సాయంత్రం స్నాపనాభిషేకం అనంతరం ఆలయంలోకి భక్తుల అనుమతి ఇవ్వనున్నట్లు ఈవో సురేష్ కుమార్, అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:ప్రజల సందర్శనకు జగన్, వాసు..!