జాతీయ వైద్యవిద్య అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)లో ఇద్దరు విద్యార్థులు సంచలన ఫలితాలను నమోదు చేశారు. ఇద్దరికీ సమానంగా.. 720 మార్కులకు గాను 720 మార్కులు వచ్చాయి. వైద్య ప్రవేశ పరీక్షలో ఇలా నూటికి నూరు శాతం మార్కులు రావడం అరుదైన విషయం. ఒడిశా విద్యార్థి సోయబ్ అఫ్తాబ్, దిల్లీకి చెందిన ఆకాంక్షా సింగ్ ఇలా చరిత్ర సృష్టించారు. జాతీయ స్థాయిలో ఇద్దరికీ వరుసగా ప్రథమ, ద్వితీయ ర్యాంకులు లభించాయి.
నీట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులూ ఉత్తమ ప్రతిభ కనబర్చారు. జాతీయ ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థిని తుమ్మల స్నికిత 3వ ర్యాంకు సాధించి, తెలంగాణ ర్యాంకుల్లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. తొలి 20 ర్యాంకుల్లో మన విద్యార్థులు మూడింటిని సొంతం చేసుకోగా, తొలి 50 ర్యాంకుల్లో 7 స్థానాలను కైవసం చేసుకొని సత్తా చాటారు.
ఇంకా అనంత పరాక్రమ(11వ ర్యాంకు), బారెడ్డి సాయి త్రిషారెడ్డి(14వ ర్యాంకు), శ్రీరామ్ సాయి శాంతవర్థన్(27వ ర్యాంకు), ఆర్షశ్ అగర్వాల్(30వ ర్యాంకు), మల్లేడి రుషిత్(33వ ర్యాంకు), ఆవుల శుభాంగ్(38వ ర్యాంకు) ముందు వరుసలో నిలిచారు. బాలికల విభాగంలో తొలి 20 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన నిత్య దినేష్(అఖిల భారత ర్యాంకుల్లో 58వ ర్యాంకు) 17వ స్థానాన్ని పొందారు. ఈనెల ఆఖరి వారంలో రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశ ప్రకటన జారీ చేయనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. కొవిడ్ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన నీట్-2020ను గత నెల 13న నిర్వహించారు. కొవిడ్ బాధితుల కోసం ఈనెల 14న మరోసారి నిర్వహించారు. వీరందరి ఫలితాలను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు ‘జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-ఎన్‌టీఏ)’ ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా రాత్రి 8 గంటల వరకూ ఫలితాలు వెల్లడవ్వలేదు.
ముందుగా అఖిల భారత కోటా ప్రవేశాలు..
జమ్ము-కశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ వైద్యకళాశాలల నుంచి సేకరించిన 15 శాతం ఎంబీబీఎస్ సీట్లతో నిర్వహించనున్న అఖిల భారత వైద్యవిద్య సీట్ల కూటమి ప్రవేశాల ప్రక్రియను రాష్ట్ర ప్రవేశాల కంటే ముందుగానే నిర్వహిస్తారు. తెలంగాణ నుంచి అఖిల భారత కోటాకు 467 ఎంబీబీఎస్ సీట్లను ఇస్తారు. అఖిల భారత కోటాలో రెండు విడతల ప్రవేశ ప్రక్రియల అనంతరం మిగిలిన సీట్లను రాష్ట్రాలకు అందజేస్తారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించే అఖిల భారత ప్రవేశాల సమాచారం కోసం అభ్యర్థులు ్ర్ర్ర.్ఝ‘‘.-i‘.i- వెబ్‌సైట్‌లో చూడాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. రాష్ట్రస్థాయిలో నిర్వహించే కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా సీట్ల ప్రవేశాలను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భర్తీ చేస్తారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ వైద్యకళాశాలల్లో 4,915 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన..
నీట్ అఖిల భారత ర్యాంకులు విడుదలైనా.. ఆ సమాచారం రాష్ట్రానికి చేరడానికి వారం పట్టవచ్చని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. దీని ఆధారంగా ప్రాథమిక ర్యాంకులను రాష్ట్ర స్థాయిలో విడుదల చేస్తారు. ఈనెల చివరి వారంలో కన్వీనర్ కోటాలో వైద్యవిద్య ప్రవేశ ప్రకటనను విడుదల చేసి, అర్హుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తారు. కొవిడ్ దృష్ట్యా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు.
ఓపెన్‌లో అర్హత మార్కు 147
ఓపెన్ కేటగిరీలో గతేడాది అర్హత మార్కు 134 ఉండగా.. ఈసారి 147 మార్కులకు అర్హతగా నిర్ణయించారు. అఖిల భారత స్థాయిలో 50-60వేల లోపు ర్యాంకులు వచ్చినవారికి ఈసారి రాష్ట్రస్థాయిలో 1500-2000 లోపు ర్యాంకులు రావచ్చని నిపుణుల అంచనా.
ఈసారి పోటీ పెరిగింది..
గతేడాదితో పోల్చితే అగ్రర్యాంకుల్లో రాష్ట్రానికి కొంత తక్కువ ర్యాంకులే వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులే సాధించారు. సుమారు 500 మార్కులు వచ్చిన విద్యార్థులకు ఓపెన్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో సీటు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రిజర్వేషన్ విద్యార్థులకు 420 వరకూ అవకాశం ఉండవచ్చు. ఎయిమ్స్, జిప్‌మర్‌లలోనూ నీట్ ర్యాంకుల ప్రాతిపదికనే సీట్లను భర్తీ చేస్తుండడంతో.. మన విద్యార్థుల్లో ఎక్కువ మంది వాటిల్లో సీట్లు పొందుతారు. తద్వారా ఇక్కడ ఇతరులు సీట్లు పొందడానికి అవకాశాలు పెరుగుతాయి. -పి.శంకర్‌రావు, డీన్, శ్రీచైతన్య విద్యాసంస్థలు
అమ్మానాన్నల బాటలోనే..
నాన్న సదానంద్‌రెడ్డి హృద్రోగ నిపుణులు. అమ్మ లక్ష్మీరెడ్డి గైనకాలజిస్టు. వాళ్లిద్దరి స్ఫూర్తితోనే ఈ రంగంపై ఆసక్తి ఏర్పడింది. నాన్న 20 ఏళ్ల క్రితం దిల్లీ ఎయిమ్స్‌లోనే పీజీ చేశారు. నేనూ అక్కడే చదువుతా. - టి.స్నికిత, ఆలిండియా 3వ ర్యాంకు
పరిశోధనలపై ఆసక్తి..
నాన్న నారాయణరావు మేడ్చల్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ. నాకు న్యూరాలజీ విభాగంపై ఆసక్తి. పరిశోధనలపై ఆసక్తితోనే నీట్ రాశా. దిల్లీ ఎయిమ్స్‌లో చదవాలన్నదే లక్ష్యం. - అనంత పరాక్రమ, 11వ ర్యాంకు
న్యూరో సర్జన్‌గా సేవలందిస్తా..
తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో నేను ఉత్తమ ర్యాంకు సాధించగలిగాను. దిల్లీలోని ఎయిమ్స్‌లో చదివి.. న్యూరో సర్జన్‌గా సేవలందిస్తా. -సాయిత్రిషారెడ్డి, 14వ ర్యాంకు
ఇదీ చదవండి: సమన్వయం లేకనే ముంపు... విశ్రాంత ఇంజినీర్ల విశ్లేషణ