tdp report on Pedana family suicide case : కృష్ణా జిల్లా పెడనలో చేనేత కుటుంబం ఆత్మహత్యపై నిజనిర్ధారణ కమిటీ సభ్యులు.. నివేదికను అధినేత చంద్రబాబుకు అందించారు. ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వ విధానాలతోనే కాశం పద్మనాభం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదికలో వెల్లడించారు. ఆర్థికంగా చితికిపోవడంతో పాటు తమ కుటుంబం ఆధారపడిన చేనేత వృత్తికి ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కమిటీ తెలిపింది. అప్పులకు తోడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక తీవ్ర మనోవేదనతో పద్మనాభం కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేనేత కుటుంబాలకు రాయితీలు ఇచ్చి ఆదుకునే చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని నివేదికలో స్పష్టం చేశారు.
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని పెడన మున్సిపాలిటీలోని 17వ వార్డులో చేనేత కుటుంబం జనవరి 31వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. భార్య నాగ లీలావతి(45), కుమారుడు రాజా నాగేంద్ర(24)తో కలిసి కాశం పద్మనాభం(52) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి నిజానిజాలను తెలుసుకునేందుకు తెదేపా తరఫున ఐదుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీలో పార్టీ నేతలు అనగాని సత్య ప్రసాద్, అంగర రామ్మోహన్ రావు, గంజి చిరంజీవి, ఎంఎస్ రాజు, వావిలాల సరళాదేవి ఉన్నారు.
ఇదీ చదవండి