రాష్ట్ర మంత్రులంతా అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లైతే అందులో మొదటి స్థానం బొత్స సత్యనారాయణదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. పేదలకు ఇళ్లు పంచటం చేతకాక మంత్రి బొత్స తెదేపాపై అవినీతి ముద్రవేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్కు ఊరికో ప్యాలెస్ ఉండొచ్చుగానీ, సామాన్యుడికి నాణ్యమైన ఇల్లు ఉండకూడదా అని నిలదీశారు. అధికారంలోకి వచ్చి 17 నెలలైనా ఇంకా తెదేపాపై విమర్శలు చేస్తున్నారు తప్ప.. చేసిన అభివృద్ధి శూన్యమని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
ఇళ్ల స్థలాల పంపిణీలో ఇప్పటికే 4 వేల కోట్ల రూపాయలు కాజేసి మరింత దోపిడీ కోసమే పట్టాలు ఇవ్వట్లేదని ఆరోపించారు. ఇళ్లస్థలాల పంపిణీపై చంద్రబాబు కోర్టుకు వెళ్లారంటూ అసత్యాలు మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని దానిని నిరూపించాలని సవాల్ విసిరారు. వైకాపా నేతలే కోర్టుకెళ్లారని నిరూపించేందుకు తాము సిద్ధమని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
ఇళ్ల స్థలాల పంపిణీలో కోర్టు వివాదాల్లో ఉన్న కేవలం 2 వేల ఎకరాలేనన్నారు. మిగిలిన స్థలాల పంపిణీ చేయలేకపోవడం వైకాపా చేతకాని తనమని విమర్శించారు.
ఇదీ చదవండి