పౌరసత్వ సవరణ చట్టం పట్ల దేశ వ్యాప్తంగా అభద్రతా భావం వ్యాపించిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)లను తెదేపా వ్యతిరేకిస్తుందని అయన స్పష్టం చేశారు. వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ ముస్లింలందరికీ మద్దతు తెలుపుతామని అయన తేల్చి చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో 13 జిల్లాల మైనార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం చంద్రబాబు సమావేశమయ్యారు.
లౌకికవాదానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ చట్టాలకు పార్లమెంట్‌లో మద్దతు తెలియజేసి... బయట మాత్రం వ్యతిరేకమని చెప్పి మైనార్టీలను జగన్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మైనార్టీలు అధికంగా ఉన్న అమరావతిలో రాజధాని నిర్మిస్తుంటే జగన్‌మోహన్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు.
వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రంలోని మైనార్టీలు ఉపాధి కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక కొరత, వివిధ ప్రాజెక్టుల పనులు నిలిపివేయటం, పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోతుండటంతో యువత ఉపాధి కోల్పోతున్నారని మైనార్టీ నాయకులు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. మైనార్టీల కోసం తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో పథకాలు అమలు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు.
ఇదీ చదవండి: 'అమరావతి రైతుల కోసం నా ప్రాణాలను అడ్డువేస్తా'