TDP Leaders Lash Out at YCP Leaders: గన్నవరంలో నారా లోకేశ్ యువగళం బహిరంగ సభలో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా టీడీపీ నేతలు వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. కంచుకోట గన్నవరంలో మరోసారి తెలుగుదేశం గెలుపు ఖాయమని.. ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసిన తాను, ఈ నియోజకవర్గాన్ని వీడబోనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ అసభ్య పదజాలంతో తెలుగుదేశం నాయకులను దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవడు పోటీ చేసినా గెలిచే తెలుగుదేశం కంచుకోటలోకి తనను తీసుకొచ్చింది వంశీనే అని వెల్లడించారు.
కనకమేడల రవీంద్రకుమార్: యువగళం పాదయాత్ర కృష్ణాజిల్లాతో పాటు, రాష్ట్ర నాయకత్వం, కార్యకర్తలకు చెప్పలేనంత ఉత్సాహాన్ని ఇస్తోందని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ తేలిపారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన ఏ వాగ్ధానాన్ని అమలు చేయలేదని ధ్వజమెత్తారు. సీఎం అయిన దగ్గర్నుండి మాట తప్పడం, మడమ తిప్పడం కొనసాగిస్తూనే ఉన్నాడని విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేత మొదలు రుషికొండకు బోడిగుండు కొట్టిన వరకు విధ్వంస పాలనే జగన్ చేస్తున్నాడని దుయ్యబట్టారు. 25మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేకహోదా కేంద్రం మెడలు వంచి తెస్తానని అన్నాడు. నమ్మిన ప్రజలు ఎంపీలను ఇస్తే తన 31కేసుల మాఫీ కోసం కేంద్రం వద్ద మెడలు వంచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయ్యన్నపాత్రుడు: లోకేశ్ యువగళం.. ప్రజాగళంగా మారిందని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. వచ్చే ఎన్నికల తర్వాత జగన్ ఇంటికి పోవడం ఖాయం అంటూ ఎద్దేవా చేశారు. ఇన్ని కేసులున్న సీఎంను దేశంలో ఎక్కడా చూసుండరని ఆరోపించారు. ఇప్పటివరకు 18 సార్లు దిల్లీ వెళ్లిన జగన్... ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని ఎప్పుడైనా అడిగారా? అంటూ ప్రశ్నించారు. కేసుల నుంచి కాపాడుకునేందుకే జగన్ దిల్లీకి వెళ్తున్నారని విమర్శలు గుప్పించారు. చదువుకున్న వారంతా ఈసారి ఆలోచించి ఓటేయాలని అయ్యన్న పిలుపునిచ్చారు. బలహీనవర్గాలను రాజకీయాల్లో ప్రోత్సహించిన ఘనత.. ఎన్టీఆర్‌దే అని పేర్కొన్నారు.
పంచుమర్తి అనూరాధ: యువగళం పాదయాత్ర ప్రభంజనంలా సాగుతోందని శాసమండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ అన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో తెదేపా అభ్యర్థులకు యువత పట్టం కట్టారన్నారు. యువగళం పాదయాత్ర ప్రభావంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా ఎమ్మెల్యేలు తనకు ఓట్లు వేసి ఎమ్మెల్సీని చేశారని తెలిపారు. యువగళం పాదయాత్ర మొదలైన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారాయని వెల్లడించారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పంచాయతీల్లో కూడా తెదేపా ఊహించని రీతిలో విజయం సాధించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో గంజాయి, డ్రగ్స్, ఇసుక, ఎర్రచందనం, మట్టి, గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోందని మండిపడ్డారు.
మండలి బుద్దప్రసాద్: రాష్ట్ర భవిష్యత్తుకు సక్రమమైన నాయకుడు రావాలి కానీ జగన్ వంటి వక్రబుద్ధి కలిగిన నాయకులు రాకూడదని మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా ఉన్నతమైన, నిస్వార్ధమైన నాయకులకు పెట్టిన పేరు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యి తెలుగుజాతి గొప్పదనాన్ని విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేశారన్నారు. నేడు కొంతమంది అరాచకశక్తుల వల్ల కృష్ణా జిల్లా ప్రతిష్ట మసకబారిందన్నారు. శాసన సభను అపవిత్రం చేసిన ఎమ్మెల్యేలు కృష్ణాజిల్లాకు చెందిన వారు ఉండడం చాలా బాధాకరమన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి నిస్వార్ధ నాయకుడు అసెంబ్లీకి వెళ్లిన గన్నవరంలో నేడు ఉన్న ఎమ్మెల్యే జిల్లా పరువు తీస్తున్నాడని మండిపడ్డారు.
బొండా ఉమా: 2009లో చంద్రబాబు వంశీకి పార్టీలో చోటు ఇవ్వకపోతే వంశీ పేరు, వంశీ ముఖం గన్నవరం ప్రజలకు కూడా తెలియదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షతో గన్నవరంలో ఎమ్మెల్యేగా వంశీ గెలిచాడన్నారు. 1983 నుండి గన్నవరంలో అనేక మంది పెద్దలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇలాంటి ప్రదేశంలో 2014లో చంద్రబాబు గన్నవరం నుండి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. వంశీ బుద్ధి తేడా అని పార్టీలో అందరికీ తెలిసినా చంద్రబాబు మాటకు విలువ ఇచ్చి గౌరవించామన్నారు. పోలీసులే దగ్గరుండి పార్టీ ఆఫీసుపై దాడి చేయించి అడ్డుకున్నతెదేపా కార్యకర్తలు, నాయకులపై 302, 307, అట్రాసిటీ కేసులు పెట్టారని మండిపడ్డారు. బ్రహ్మలింగం చెరువు, కొండలు, పేకాట డబ్బులు, క్యాసినో, పేదల రక్తం పీల్చిన డబ్బులను పంచుతూ వంశీ కలరింగ్ ఇస్తున్నాడని దుయ్యబట్టారు.