TDP leaders fire on Minister Peddireddy: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకం రాష్ట్రమంతా చూసిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు పులివెందుల పర్యటన విజయవంతం కావడంతో వైసీపీ నేతలకు దిక్కుతోచని పరిస్థితి ఉందన్న నేతలు.. అందుకే పుంగనూరులో అల్లర్లు ప్రేరేపించారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా ఎవ్వరి జాగీరు కాదని, పుంగనూరు బైపాస్ నుంచి చంద్రబాబు వెళ్తుంటే దాడి చేయించాలని పెద్దిరెడ్డి కుట్ర పన్నారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబుకి స్వాగతం పలికేందుకు వచ్చిన తెలుగుదేశం శ్రేణుల్ని పోలీసులే అనవసరంగా రెచ్చగొట్టారని తెలిపారు.
Ap Police పుంగనూరు బైపాస్ లో చంద్రబాబు వెళ్తుంటే... పట్టణంలోకి వస్తున్నారనే ప్రచారం పోలీసులే లేపి ఘర్షణలని ప్రేరేపించారని ఆరోపించారు. రైతులకు పరిహారం చెల్లించకుండా, అనుమతులు లేకుండా వేల కోట్ల దోపిడీ కోసం పెద్దిరెడ్డి తలపెట్టిన ప్రాజెక్టులను మాత్రమే చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తన అవినీతిని చంద్రబాబు బయటపెడుతున్నారనే అక్కసుతోనే గొడవలు రేపారని విమర్శించారు. వైసీపీ రౌడీలు విచ్చలవిడి వీరంగం సృష్టిస్తుంటే పోలీసులు వారికే వంత పాడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
CBN Tour ఇవాళ శ్రీకాళహస్తి పర్యటనకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు బహిరంగ సభ జరిగి తీరుతుందని నేతలు స్పష్టం చేశారు. పోలీసుల సాయంతోనే వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. పులివెందుల పొలికేకకు తాడేపల్లి పిల్లి భయపడి దాడులు చేయిస్తోందన్న టీడీపీ నేతలు.. బాధితులపై తప్పుడు కేసులు ఉపసంహరించుకుని ఎస్పీ ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును అడ్డుకున్న తీరు దుర్మార్గం. రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడి అరాచకం మితిమీరిపోయింది. పోలీసులు, రామచంద్రారెడ్డి ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం చంద్రబాబు పర్యటించాలా..? పుంగనూరులో దాదాపు 2వేల మందిని జమచేసుకుని చంద్రబాబును అడ్డుకోవాలని పథకం వేశారు. చంద్రబాబును అడ్డుకోవాలన్నదే వారి టార్గెట్. మా కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలకడానికి వెళ్తే.. పోలీసులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. - కిషోర్ కుమార్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
పోలీసులు, వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రామచంద్రారెడ్డీ.. మేమేం మహాత్మాగాంధీ వారసులం కాదు.. కొడుతుంటే కొట్టించుకోవడానికి. దాడికి ప్రతిదాడి తప్పకుండా ఉంటుంది. పోలీసులు శాంతి భద్రతలు పర్యవేక్షిస్తారని సంయమనం పాటించాం. - భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ
జూనియర్ ఐపీఎస్ అధికారులు.. వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే వైసీపీ గూండాలు రాళ్లు, కర్రలతో అంగళ్లు, పుంగనూరులో విధ్వంసానికి పాల్పడ్డారు. ఆయా ప్రాంతాల్లో ఓటమి భయంతోనే ఈ దుర్మార్గాలకు పాల్పడ్డారు. అక్కడ ఎస్పీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. - మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీమంత్రి