తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విద్యాభ్యాసం గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేసిందంటూ ఓ వెబ్సైట్ పై డీజీపీకి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. లోకేశ్ స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివినంతకాలం.. తల్లి భువనేశ్వరి బ్యాంక్ ఆఫ్ బరోడాలోని తన అకౌంట్ ద్వారా లోకేశ్‌కు పంపిన డబ్బు వివరాల ఆధారాలను డీజీపీకి అందచేసినట్లు పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాం ప్రసాద్ తెలిపారు. తప్పడు కథనాలు ప్రచారం చేసే వెబ్సైట్లు, ఫేస్ బుక్ ఖాతాలు, ట్విట్టర్ అకౌంట్ల ప్రతినిధులకు శిక్షపడేవరకూ వదిలేది లేదని స్పష్టం చేశారు. తామిచ్చిన ఫిర్యాదుపై డీజీపీ స్పందించకుంటే న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.
'అప్పుడు తొడ కొట్టిన జగన్.. ఇప్పుడెక్కడ?'
ప్రత్యేక హోదా లేదని కేంద్రం తెల్చేసినా.. మెడలు వంచి హోదా సాధిస్తానని తొడకొట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నిలదీశారు. కనీసం నోరు తెరచి అడిగే ధైర్యం కూడా లేకుండాపోయిందని దుయ్యబట్టారు. హోదా కాదు కదా.. కేంద్రం నుంచి కప్పు కాఫీ కూడా జగన్ రెడ్డి సాధించలేరన్నారు. గుంపుగా 22 మంది ఎంపీలు ఉండి ఏం లాభం? అని ట్విట్టర్ లో నిలదీశారు.
'కనగరాజ్ గురించి నాటి సూక్తులు ఏమయ్యాయి?'
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో కనగరాజ్ గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పిన నాటి సూక్తులు ఏమయ్యాయని మాజీమంత్రి జవహర్ నిలదీశారు. ఐఏఎస్, ఐపిఎస్ అధికారులైతే పారదర్శకత ఉండదని, అందుకే విశ్రాంత న్యాయమూర్తి కనగరాజ్ ని ఎస్ఈసీగా నియమిస్తున్నాం అంటూ జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ట్విట్టర్ లో గుర్తు చేశారు.
ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో కనగరాజ్ పేరు లేకపోవటం చూస్తే జగన్ రెడ్డి మనస్తత్వం ఏంటో అర్ధమవుతోందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడం అవసరం తీరాక తాడేపల్లి కాపౌండ్ లో అడుగుపెట్టనివ్వకుండా తరిమేయటం జగన్ రెడ్డి స్టైల్ అన్నారు. మొన్న చెల్లి షర్మిల, ఈ రోజు కనగరాజ్.. తండ్రి, బాబాయ్ శవాల్నే వ్యక్తిగత స్వార్థానికి వాడుకున్న జగన్ రెడ్డి.. ఆఖరికి పక్క రాష్ట్రం పెద్దాయన కనగరాజ్ కూడా వదలలేదని దుయ్యబట్టారు.
ఇవీ చూడండి:
'రాసిపెట్టుకోండి.. దొంగ లెక్కలు తేలుస్తాం.. ప్రతీ రూపాయి కక్కిస్తాం'