TDP leaders are worried about Chandrababu's health : తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వెల్లడించకుండా ప్రభుత్వ వైద్యులపై పోలీసులు ఒత్తిడి చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు సొంత డాక్టర్లను ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు సంప్రదించ లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదని డాక్టర్లు చెబుతామన్నా.. వద్దని పోలీసులు ఒత్తిడి తెచ్చారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యంపై వాస్తవాలు చెప్పొద్దని డాక్టర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని దుయ్యబట్టారు. చంద్రబాబు వద్దకు ఆయన వ్యక్తిగత డాక్టర్ల బృందాన్ని పంపాలని నేతలు డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి చంద్రబాబును తరలించాలన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ముఖ్య నేతల సమావేశమయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లాలని తెలుగుదేశం నేతలు నిర్ణయించారు. చంద్రబాబును రక్షించుకోవడం కోసం సీఎం జగన్ ఇంటికెళ్లి వినతిపత్రం ఇస్తామని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, కళా వెంకట్రావ్, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు.
Chandrababu's health in jail : జైలులో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన
వైద్యులపై పోలీసుల ఒత్తిడి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యులను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని బయటకు వెల్లడించకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సొంత డాక్టర్లను ప్రభుత్వం ఎందుకు సంప్రదించలేదని అచ్చెన్న ప్రశ్నించారు. చంద్రబాబు వద్దకు ఆయన వ్యక్తిగత వైద్యబృందాన్ని పంపాలని, కేంద్రం పరిధిలోని ఎయిమ్స్‌కు చంద్రబాబును తరలించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఒకేసారి ఐదు కేజీల బరువు తగ్గారన్న అచ్చెన్నాయుడు.. ఇంకా బరువు తగ్గితే అవయవాలపై ప్రభావం పడుతుందని వైద్యులన్నారని తెలిపారు.
Chandrababu Illness In Jail: ఎండవేడిమి, ఉక్కపోతతో చంద్రబాబుకు అలర్జీ.. వైద్య పరీక్షలు
సీఎం నివాసం వద్ద అడ్డుకున్న పోలీసులు.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సీఎంను కలుస్తాం అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, వైద్యంపై వినతిపత్రం ఇస్తామని తెలిపారు. కాగా, తాడేపల్లిలోని సీఎం నివాసం సమీపంలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యరావును పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సీఎంకు వినతిపత్రం ఇవ్వాలంటూ పోలీసులతో బుద్దా వెంకన్న వాగ్వాదానికి దిగారు. బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యరావును అదుపులోకి తీసుకుని పోలీసులు స్టేషన్ కు తరలించారు.
చంద్రబాబు నాయుడు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి.. తద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఆత్మరక్షణలో పడేయాలన్నది జగన్ లక్ష్యం గా కనిపిస్తోంది. జైలులో చంద్రబాబు అనారోగ్యం దెబ్బతిని ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా చూడాలి.. ఒక రకంగా జైలులోనే చంపేయాలన్న కుట్ర కనిపిస్తోంది. చంద్రబాబుకు ఏమైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. - నక్కా ఆనంద్ బాబు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు
34రోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికీ తెలుసు.. ముఖ్యమంత్రిగా పనిచేసి, స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మార్చిన వ్యక్తిని ఏ చిన్న ఆధారం లేకుండాఈ ప్రభుత్వం అరెస్టు చేసింది. యువత, రైతులు, మహిళల అభ్యున్నతి కోసం అహర్నిషలు కష్టపడిన వ్యక్తిని జైలులో ఉంచడం దుర్మార్గం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోంది. స్కిన్ అలర్జీ వచ్చిన వ్యక్తికి స్టెరాయిడ్స్ ఎలా ఇస్తారు. చంద్రబాబు ఆరోగ్య రిపోర్టులు జగన్ ఇంటి నుంచి వచ్చాయా, సజ్జల పంపించాడా..? ప్రాణాలంటే విలువ లేని వ్యక్తులు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. - పంచుమర్తి అనురాధ, టీడీపీ ఎమ్మెల్సీ
చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగత వైద్యులున్నా ఎందుకు అనుమతించడం లేదు..? చంద్రబాబు నాయుడు హెల్త్ బులెటిన్ ఎందుకు విడుదల చేయడం లేదు. 5 కిలోలు తగ్గిపోయారని మీడియా ద్వారా వెల్లడైంది. వైద్యుల రిపోర్టులు ఎందుకు బయటపెట్టడం లేదు. ఇష్టారాజ్యంగా మందులు ఎలా వాడుతున్నారు.? - దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి