విశాఖ విధ్వంసానికి కుట్ర పన్నిన వైకాపా నేతలకు ఉత్తరాంధ్ర ప్రజలే తగిన బుద్ధి చెప్తారని.. తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. వైకాపా కార్యాలయానికి టూ లెట్ బోర్డు పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. విజయమ్మను ఓడించినందుకే.. విశాఖకు హుద్‌హుద్ వచ్చిందని సంబరాలు చేసుకున్న చరిత్ర వైకాపాదనీ.. చంద్రబాబుపై ఆ పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి మెప్పు కోసమే గుడివాడ అమర్నాథ్ లాంటి నేతలు నోరుపారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా కట్టడిలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతున్నా జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. తెదేపా నేతలపై చేసిన అవినీతి ఆరోపణలు వైకాపా ప్రభుత్వం నిరూపించలేకపోయిందన్నారు. అమరావతికి జగన్మోహన్ రెడ్డి మరణశాసనం రాశారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో వేల ఎకరాలను అధికార పార్టీ నేతలు కబ్జా చేశారని ధ్వజమెత్తారు. జగన్ స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు.
చంద్రబాబు విశాఖకు పరిశ్రమలు తీసుకొస్తే వైకాపా ప్రభుత్వం వాటిని వెళ్లగొట్టిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో వైకాపా ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని, ఫోన్ ట్యాపింగ్ ను హోంమంత్రి సుచరిత అత్యాచారంతో పోల్చడం దుర్మార్గమని అనిత చెప్పారు.
ఇదీ చదవండి: