ఒక పార్టీపై ద్వేషంతో.. రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో వైఫల్యం చెందిందని.. ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు ఒకపక్క కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రికి ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా... స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖకు రాజధానిని తరలించాలని చూస్తున్నారన్నారు. అమరావతి రాజధాని ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని... తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉందన్నారు.
మైలవరంలో తెదేపా నిరసన...
మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదించడం పై కృష్ణా జిల్లా మైలవరం మండల తెదేపా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక తెదేపా కార్యాలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ అమరావతి రాజధానిగా కొనసాగించాలని నిరసన తెలియజేశారు. ప్రజా వ్యతిరేకంగా జరుగుతున్న పరిపాలనను ఖండిస్తున్నామన్నారు.
ప్రకాశం జిల్లాలో నిరసన...
ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో మూడు రాజధానులు కు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు. అభివృద్ధి చెందే అమరావతిని ముక్కలు చేయవద్దని ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగినేని రామకృష్ణ, మన్నం త్రిమూర్తులు, ప్రజా సంఘం నాయకులు పాల్గొన్నారు.