Chandrababu was angry about the sale of ganja : రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి వినియోగం యువత భవిష్యత్తుని నాశనం చేయడమే కాకుండా, ఏకంగా ప్రాణాలను కూడా తీస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విజయవాడ సమీపంలో గంజాయి మత్తులో జరిగిన చిన్న గొడవ ఏకంగా అజయ్ సాయి అనే యువకుడి ప్రాణాలు తీసి, మరో ఐదుగురిని హంతకులను చేసిందని మండిపడ్డారు. దీనికి ఈ ప్రభుత్వ సమాధానం ఏమిటని ఆయన నిలదీశారు. వాడవాడలా విస్తరిస్తున్న గంజాయిపై ఇంత ఉదాసీనత ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. ఒకసారి గంజాయికి అలవాటు పడిన వారి జీవితం ఎంత ప్రమాదంలోకి వెళ్తుందో అధికారులు అర్థం చేసుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదాసీనత వల్ల గంజాయి మహమ్మారి తమ బిడ్డల వరకు వస్తుందనే విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. పక్కా ప్రణాళికతో గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ దుష్ప్రచారం వల్లే పరిశ్రమల తరలింపు.. ఏపీ నుంచి ఫాక్స్ కాన్ తెలంగాణకి తరలిపోతోందంటూ వచ్చిన కథనాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. మన వద్ద ఉన్న పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకు పంపుతున్న కోడిగుడ్డు మంత్రి, కోడికత్తి సీఎంలు సిగ్గుపడాలని మండిపడ్డారు. వీరిద్దరికి పక్క రాష్ట్రాల వాళ్లు కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ తమ మొదటి ఐఫోన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేలా టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఒప్పించామని గుర్తు చేశారు. జోకర్లు నడుపుతున్న ప్రభుత్వం వల్ల నేడు ఆంధ్రప్రదేశ్ ఓడిపోయిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపార వాతావరణం ఆరోగ్యకరంగా ఉండి, ప్రభుత్వ మద్దతు పుష్కలంగా ఉంటే ఫాక్స్ కాన్ ఏపీలోనే తమ పరిశ్రమ ను విస్తరించి అదనంగా వేల ఉద్యోగాలు కల్పించేదన్నారు. బై బై బాబు అంటూ వైఎస్సార్సీపీ చేసిన ప్రచార ప్రభావం వల్ల నేడు పరిశ్రమలు బై బై ఏపీ అంటున్న తీరు అంతా గమనిస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారం తగ్గించాలి.. రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం భక్తులపై అదనపు భారం తగదంటూ సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. హజ్ యాత్రకు ప్రభుత్వం సబ్సిడీ భరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికులతో పోల్చితే విజయవాడ నుంచి వెళ్లే ఒక్కొక్కరిపై 83,000 అదనపు భారం పడుతోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో హజ్ యాత్రకు రూ. 2,40,000 ఏర్పాటు చేశామన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ మొత్తం రూ.3,88,580 చేసిందని, పొరుగున ఉన్న హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లాలంటే 3,05,000 మాత్రమే ఖర్చు అవుతోందన్నారు. ఏపీ నుంచి వెళ్లే ఒక్కో ప్రయాణికుడి మీద 83,000 ఆదనపు భారం మోపటం సబబు కాదని అన్నారు. పేద ముస్లిం భక్తులు హజ్ యాత్రకు వెళ్లేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగినంత సబ్సిడీని భరించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి :