జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నందుకే రెండున్నరేళ్లకే ప్రశాంత్ కిషోర్ బృందాన్ని దించాలనుకున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న విమర్శించారు. మంత్రివర్గంలో ప్రజల గురించి చర్చించకుండా పీకే పనుల గురించి చర్చించటం శోచనీయమని ధ్వజమెత్తారు. ఈ సారి పవన్ కళ్యాణ్ కాదు, జగన్ రెడ్డి తాత రాజారెడ్డి దిగొచ్చినా ఎగిరేది తెలుగుదేశం జెండానే అని తేల్చిచెప్పారు. రెండున్నరేళ్లలో రాష్ట్రానికి జగన్ రెడ్డి చేసిన దౌర్భాగ్య పనులే తమకు దీవెనలని పేర్కొన్నారు. మరోసారి మోసపోవటానికి ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.
2019 ఎన్నికల్లో పీకే బృందం అసత్య ప్రచారాలు తిప్పికొట్టడంలో విఫలమయ్యాం. వివిధ కులాలను రెచ్చగొట్టడంలో పీకే విజయం సాధించారు. చంద్రబాబుకు ఉన్న మంచితనం అనే వీక్ నెస్ తో ఆడుకుని వైకాపా విజయం సాధించింది. తెదేపాకు పీకేలు, బోసు డీకేల అవసరం లేదు. ప్రతి అబద్ధాన్నీ రుజువులతో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. నవరత్నాల పేరుతో నవమోసాలకు పాల్పడ్డారు. రూ.3వేలు ఇవ్వాల్సిన ఫించన్ రూ.2250కే పరిమితం చేశారు. ఏటా రూ.250 పెంచుతానన్న హామీ ప్రకారం రూ.2750 రావాల్సి ఉంది. వీటిపై పీకే ఈసారి ఏం పోస్టులు పెడతారు. రాష్ట్రం అయ్యో ఆకలి అని అలమటిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వైకాపాకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ అరచకాల్లో బీహార్ ని మించిపోయేలా చేశారు." అని దుయ్యబట్టారు. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో బుద్ధా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత.. దేపా, వైకాపా వర్గీయుల తోపులాట