సీఎం జగన్ పై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసమర్థ పాలనతో మహిళల ప్రాణాలకు ఖరీదు కడుతున్నారని మండిపడ్డారు. దిశ అనేది చట్టం కాదని.. అదొక కార్యక్రమం మాత్రమేనని వ్యాఖ్యానించారు. కేంద్రం కొర్రీలతో చట్టంగా మారేందుకు సమయం పడుతుందని డీజీపీ అనడంలో అర్థంలేదని విమర్శించారు. దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో నిందితులకు ఉరిశిక్ష వేస్తామని ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగు మహిళల్ని, టీఎన్ఎస్ఎఫ్ సభ్యుల్ని, తెలుగు యువకుల్ని హౌస్ అరెస్టులు చేసి, అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, హోం మంత్రి సుచరిత, పోలీసుల వల్ల ఇబ్బందులపాలయ్యామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులపై ఏమైనా విచారణ చేపట్టారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు గౌతమ్ సవాంగ్ సమాధానం ఎందుకు చెప్పలేకపోయారని దుయ్యబట్టారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ వైకాపా ప్రతినిధి కాదని.. ఐపీఎస్ ఆఫీసర్ అన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు.
ఇదీ చదవండి
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే రికార్డు.. సరుకు రవాణాలో 51శాతం వృద్ధి!