TDP Agitations on CBN Arrest: చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు మారుతి చౌదరి మరో నలుగురితో పాటు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నామని శుక్రవారం ప్రకటించారు. అయితే పోలీసులు శనివారం అర్ధరాత్రి దాటాక(ఆదివారం తెల్లవారుజామున).. వారిని అదుపులోకి తీసుకొని అనంతపురం తరలించారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కృష్ణా జిల్లా కొమరవోలులో టీడీపీ నాయకులు, గ్రామస్థులు కొవ్వొత్తులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వర్ల కుమార్ రాజా, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం జగన్ కక్ష పూరితంగా.. చంద్రబాబుపై తప్పుడు కేసు బనాయించారని కొనకళ్ల నారాయణ విమర్శించారు. తమపై ఎన్ని కేసులు పెట్టుకున్నా.. పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు.
లోకేశ్ చేస్తున్న పాదయాత్రలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ చూసి ఓర్వలేక.. ప్రతిపక్షాలపై సీఎం జగన్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 12వ రోజు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ ఛైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్ దీక్షలో పాల్గొన్నారు. వీరితో పాటు సంఘీభావంగా న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు కళ్లకు గంతలు కట్టుకుని దీక్షలో పాల్గొన్నారు.
Chandrababu Arrest in Skill Development Case: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. చంద్రబాబు అరెస్టుపై నిరసనగా అనపర్తి నుంచి భారీ బైక్ ర్యాలీగా వెళ్లి భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపేందుకు 'ఛలో రాజమండ్రి'కి పిలుపనిచ్చారు. ఈ నేపంథ్యంలో బైక్ ర్యాలీ, ధర్నాలకు అనుమతులు లేవని తమ కార్యక్రమాన్ని విరమించుకోవాలని పోలీసులు నోటీసులు అందజేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా వేలివెన్నుకు చెందిన మహిళలు కార్యకర్తలు మేరీ మాత ఆలయానికి పాదయాత్ర చేపట్టారు. వేలివెన్ను గ్రామం నుంచి దేవరపల్లి మండలం గౌరీపట్నం మేరీ మాత ఆలయం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరగనుంది.
Protests on Chandrababu Arrest in AP: మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణం అని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పోలీసులు ఎన్ని రకాల ఆంక్షలు విధించినా తమ కార్యక్రమం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కర్నూలు జిల్లా ఆదోనిలో 11వ రోజు టీడీపీ శ్రేణులు వినూత్న నిరసన చేశారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో ఆదోని మండలం బసపురం గ్రామంలో జల దీక్ష నిర్వహించారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'సైకో పోవాలి..సైకిల్ రావాలి' అనే నినాదంతో హోరెత్తించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా నిజాయతీతో పాలన సాగించిన చంద్రబాబును అక్రమ కేసులో అరెస్ట్ చేయడం అన్యాయమని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు.