విజయవాడ వాతవరణమంటేనే భానుడి భగభగ, వేడి, ఉక్కపోత. ఈ తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కృష్ణానదిలో ఈత ఎంతో ఉపకరిస్తోందని ఈతకొట్టేవారు అంటున్నారు. ఈత వలన ఉపశమనంతో పాటు శరీరానికి సంపూర్ణమైన వ్యాయమం దొరుకుతుంది. ప్రతిరోజూ గంట పాటు స్విమ్మింగ్ చేయడం వలన రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. ఈత కొట్టేవారిలో మెదడు పనితీరు, జీర్ణశక్తి మెరుగుపడతాయి. నేలపై చేసే వ్యాయామం కంటే నీటిలో ఈత వలన ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గుండె, ఊపిరితిత్తులకు మేలు కలుగుతుంది. శ్వాస ప్రక్రియ మెరుగవుతుంది. శరీరంలోని కెలోరీలు, కొవ్వు కరుగుతాయి. రక్తపోటు తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించి సుఖ నిద్రకు దోహదం చేస్తుంది. అరగంట పాటు ఈత కొడితే శరీరంలోని 300 క్యాలరీలు కరుగుతాయని.. అందుకే క్రమం తప్పకుండా ఈతకొట్టడం వల్ల అన్ని అనారోగ్యాలకు దూరంగా ఉండగలుగుతున్నామని వీరు స్పష్టం చేస్తున్నారు.
స్వచ్ఛమైన నీటిలో ఈత
ఎలాంటి అనారోగ్యం దరి చేరనివ్వకుండా ఉండేందుకు ఉదయం కాసేపు ఈత కొడితే సంపూర్ణ ఆరోగ్యం తమ సొంతం అంటున్నారు వీరంతా. నది మధ్యలో లభించే మెత్తటి మట్టి రాసుకుని ఈతకొట్టడం ఇక్కడి ప్రత్యేకత. ప్రకాశం బ్యారేజీ దిగువన వారధి దాటాక ఉన్న ఈ పాయకు ఓ ప్రత్యేకత ఉంది. ఇది ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహం కాదు. భూగర్భంలో నుంచి ఉబికి వచ్చే ఊట నీరు పాయలాగా ప్రవహిస్తుంది. మొత్తంగా 6 అడుగులకు మించి లోతు ఉండదు. ఊటనీరు కావటంతో ఇక్కడి నీరు ప్రతి రోజూ స్వచ్ఛంగానే ఉంటుంది. సూర్య నమస్కారాలు చేస్తూ ఈతకొట్టి తమ రోగనిరోధకశక్తిని పెంచుకుంటున్నారు. కరోనాకు ముందు 200మందితో నిత్యం సందడిగా ఉండేది. అయితే కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే స్విమ్మింగ్ చేసేందుకు వస్తున్నారు.
పూల్ కన్నా నది మేలు
స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత కొట్టడం వల్ల లాభాలు ఉన్నప్పటికీ అనారోగ్య కారకాలూ పొంచి ఉన్నాయి. ఈత కొలనులోని నీరు కడుపులోకి వెళ్లడం వల్ల షిగెల్లోసిస్ బ్యాక్టీరియాతో పాటు జ్వరం, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇ-కోలి బ్యాక్టీరియాతో డయేరియా రావొచ్చు, జ్వరం, జాండిస్, చర్మంపై దద్దుర్లు వస్తాయి. హెపటైటీస్-ఏ వైరస్‌తో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. నీటిలో కలిపే క్లోరిన్ తదితర రసాయనాలతో చర్మం, తలవెంట్రుకలు, కళ్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈతకొలనులో చేసే స్విమ్మింగ్ కంటే స్వచ్ఛమైన ఊటనీరులో కొట్టే ఈత వల్ల ఇలాంటి సమస్యలేవీ ఉండవని చెప్తున్నారు.
చూశారా ఈతకొట్టడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. అదీ స్వచ్ఛమైన నది నీటిలో స్విమ్మింగ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని రోజూ ఈతకొట్టేవారు చెప్తున్నారు. కాబట్టి కరోనా మహమ్మారి అంతమయ్యాక మీరూ ట్రైచేయండి..
ఇవీ చదవండి..