కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతం దివిసీమ పేరుచెప్పగానే.. 1977 నాటి ఉప్పెన గుర్తొస్తుంది. ఆ ప్రకృతి విపత్తు పెట్టిన కష్టాలతో రాటుదేలిన అక్కడి ప్రజలు.. తరువాతి రోజుల్లో తుపానులు, వరదలను తట్టుకోగలిగారు. అయితే.. గతేడాది నెల రోజుల వ్యవధిలోనే వచ్చిన వరుస తుపానులతో తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామన్న దశలో.. నివర్ తుపాన్ మరోసారి అన్నదాతలను నిండా ముంచింది. ఆ బీభత్సం అక్కడి రైతులను తేరుకోలేని కష్టాల్లోకి నెట్టింది. కూలీల కొరతతో పెట్టుబడి ఖర్చు ఎక్కువ కావటం.. పంట చేతికొచ్చినా అనుకున్న ధర రాకపోవటం.. ప్రభుత్వ సాయం అంతంతమాత్రంగానే ఉండటం.... అప్పులు పెరగటం వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
సాగు చేయలేక.. కౌలుకు ఇచ్చేస్తున్న యజమానులు
ఎక్కువమంది భూయజమానులు పొలాల్ని కౌలు రైతులకు ఇచ్చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో సాగుచేస్తే.. జీవితాలు బాగుపడతాయనే ఆశతో.. కౌలు రైతులూ పంటలు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే పంటకు బీమా చేయించాలనే అంశంపై అవగాహన లేకపోవటం.. మరోవైపు ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు.. పంటకు ధర పడిపోయినప్పుడు ముందుగా కౌలు రైతులే నష్టపోతున్నారు.
అప్పులు తీర్చలేక.. కౌలు రైతుల ఆత్మహత్యలు
నివర్ తుపాను మిగిల్చిన నష్టానికి తట్టుకోలేక.. అవనిగడ్డ నియోజకవర్గంలో నెల రోజుల వ్యవధిలోనే నలుగురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చల్లపల్లి మండలం పాగోలు గ్రామానికి చెందిన గద్వాల కృష్ణంరాజు.. చల్లపల్లి మండలం చింతలమడలో సాంబశివరావు.. అప్పులు తీర్చలేకే ఆత్మహత్య చేసుకున్నారు. కొత్తపేట గ్రామానికి చెందిన ముళ్లపూడి కృష్ణయ్య.. మొదుముడి గ్రామంలో ఓలేటి ఆదిశేషు పంట నష్టం భరించలేకే ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. మరణించే ముందు పొలాలను ఓ సారి చూసి కంటతడి పెట్టారని.. ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదనే ఆవేదనతోనే బలవన్మరణానికి పాల్పడ్డారని వారి కుటుంబసభ్యులు తెలిపారు.
ముందుగా నీళ్లు ఇస్తే.. ముప్పు నుంచి బయటపడొచ్చు
రాయితీ విత్తనాలు సహా ప్రభుత్వం అందించే ఏ ప్రయోజనాలూ కౌలు రైతులకు అందట్లేదని కుటుంబసభ్యులు వాపోతున్నారు. గతేడాది జులై 4వ తేదీ వరకూ ప్రకాశం బ్యారేజీ నుంచి నీళ్లు విడుదల చేయకపోవటంతో పంట వేయటం ఆలస్యమైంది. తీరా పంట కోతకొచ్చేసమయానికి తుపాను బీభత్సం సృష్టించింది. ఈ పరిస్థితి లేకుండా ముందుగానే నీళ్లు ఇస్తే.. తుపానుల నుంచి బయటపడొచ్చని రైతులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: