రాష్ట్రంలో ఐటీ సంబంధిత పరిశ్రమల కోసం విశాఖ, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో సిటీ 10 చ.కి.మీ పరిధిలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమెరికాలోని కొలంబియా నగర తరహాలో ఇవి తయారు కావాలని సూచించారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేలా చూస్తున్నామని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రోత్సాహక ధరలతో భూమి, నీరు, విద్యుత్ ఇస్తామని జగన్ స్పష్టం చేశారు.
కాన్సెప్ట్ సీటీల్లో ఏం చేస్తారంటే
⦁ ఐటీతో సంబంధం ఉన్న నైపుణ్య శిక్షణ నుంచి అప్లికేషన్లు అభివృద్ధి చేసే డేటా, సేవా కేంద్రాలు, సర్వర్ల నిర్వహణ సంస్థలు అన్నీ ఒకే చోటకు తీసుకువస్తారు.
⦁ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమలు ఆకర్షించడమే దీని ప్రధాన లక్ష్యం.
⦁ ఐటీ సంస్థలతో ప్రత్యేక నగరాన్ని ఏర్పాటు చేస్తే ఖర్చు కూడా తగ్గుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఐటీ వ్యవస్థతో సచివాలయాల అనుసంధానం
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థను అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇది సక్రమంగా పనిచేస్తే అవినీతి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. రేషన్, పింఛను, ఆరోగ్యశ్రీ, ఫీజు చెల్లింపు కార్డులన్నీ సచివాలయాలే ఇస్తాయని సీఎం చెప్పారు. లబ్ధిదారులకు ఈ కార్డులన్నీ సక్రమంగా అందాలంటే దానికి సంబంధించిన వ్యవస్థ సక్రమంగా ఉండాలన్నారు. లోటుపాట్లకు తావులేకుండా పటిష్ఠంగా రూపొందించాలని సూచించారు.
తిరుపతిలో టీసీఎస్
తిరుపతిలో క్యాంపస్ ఏర్పాటుకు సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ టీసీఎస్ సానుకూలంగా ఉందని సీఎం వెల్లడించారు. ప్రపంచ సాంకేతిక రంగంలో వస్తోన్న నూతన విధానాలు సాంకేతిక అంశాలపై బోధన, శిక్షణ సంస్థను ఏర్పాటు చేయడంపై ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ఐటీ అనుమతి తప్పనిసరి
ఏ ప్రభుత్వ శాఖకు ఎలాంటి అప్లికేషన్ కావాల్సి వచ్చినా ఐటీ విబాగం అనుమతి తప్పనిసరని సీఎం స్పష్టం చేశారు. ఆ తర్వాతే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలన్నారు. దీనిపై సర్క్యులర్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎక్కడా డూప్లికేషన్ అవసరం లేకుండా ఐటీ శాఖలోని ఒక్కో విభాగానికి ఒక్కో పనిని అప్పగించాలని సూచించారు. ఆర్టీజీఎస్కు అనలిటిక్స్ బాధ్యతను అప్పగించడం ద్వారా పూర్తి స్థాయి సేవలు పొందొచ్చని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా అందుకు ఆయన అంగీకరించారు.
ఇదీ చూడండి: