కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పరచివర గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకున్న బొండాడ కుటుంబ సభ్యులు.. ఆత్మీయ కలయిక వేడుకను ఘనంగా జరుపుకున్నారు. దేశవిదేశాల్లో స్థిరపడిన బొండాడ కుటుంబీకులు సంక్రాంతిని జరుపుకునేందుకు గ్రామానికి విచ్చేయడంతో ఆత్మీయత వెల్లివిరిసింది. ఈ కార్యక్రమాన్ని మూడు రోజులపాటు నిర్వహిస్తూ.. కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా గడిపారు. చిన్నారులకు రంగవల్లులు, ఆటపాటలు నిర్వహించారు. పండుగ నాడు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల వంటకాలతో కుటుంబీకులంతా సామూహిక భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగాది రమాదేవి, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలను మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోతున్న తరుణంలో ఈ వేడుకను కార్యక్రమంగా నిర్వహించడం ఎంతో స్ఫూర్తినిస్తుంది. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. ఎంత స్థాయిలో ఉన్నా మన మూలాలను మర్చిపోకూడదు. రైతు కుటుంబం నుంచి వచ్చామన్న విషయాన్ని గుర్తించుకోవాలి. పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ గ్రామాల్లోని రైతుల మధ్య ఈ వేడుకను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. గ్రామంలో ఎవరైనా సంక్రాంతి సంబరాల వేడుకలు నిర్వహిస్తే తన వంతు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. - బొండాడ రాఘవేంద్ర రావు, కుటుంబీకుడు