గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఆర్థిక వనరులు మెరుగుపర్చాలన్న లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెత్త సంపద కేంద్రాలు(సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్) అలంకారప్రాయంగా మారాయి. వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన కేంద్రాల నిర్వహణ విషయంలో సిబ్బంది లోటు, ఆర్థికపరమైన అంశాలు వాటిని మూలనపడేలా చేసినా ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న మనం, మన పరిశుభ్రత ద్వారా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశం దక్కింది. తాజా పథక కార్యాచరణ, పర్యవేక్షణలో అధికారులు చొరవ చూపితే లక్ష్యం నెరవేరడంతో పాటు పంచాయతీలకు కొంత ఆర్థిక పరిపుష్ఠి కలిగే అవకాశాలున్నాయి.
పని చేసినవి కొన్నే..
● బంటుమిల్లి శ్మశానం పక్కన ఏర్పాటైన చెత్త సంపద కేంద్రంలో సేకరించిన చెత్తను కాల్చకుండా గత ప్రభుత్వం తలపెట్టింది. అందుకు విరుద్ధంగా సిబ్బంది చేయడంతో వచ్చే పొగతో పుట్టిన బిడ్డలు, నివాసముంటున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని మురవదిబ్బ, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడా కేంద్రంలో ఎలాంటి పనులు చేపట్టడంలేదు.
● విస్సన్నపేట మండలం తాతకుంట్ల, తెల్లదేవరపల్లిలో చెత్త సంపద కేంద్రాలు ఏర్పాటు చేసినా ఇప్పుడు మనుగడలో లేవు. ఈ ఊళ్లలో చెత్తను సేకరించకుండా అలాగే వదిలేస్తున్నారు. మండలంలో 11 చోట్ల ఈ కేంద్రాలను నిర్మించారు. రెండుచోట్ల ప్రారంభించారు. రాష్ట్రంలో మొదటిసారిగా విస్సన్నపేటలో సేకరింంచిన ప్లాస్టిక్, గాజు వస్తువులు, పారవేసిన పాత వస్త్రాలను నాశనం చేసి, తిరిగి ఉపయోగించేందుకు వీలుగా రూ. లక్షల విలువైన యంత్రాలు ఉపయోగించిన దాఖలాలు లేవు.
పెడన మండలంలోని 24 పంచాయతీల్లో చెత్త సేకరణ కేంద్రాలు నిర్మించినా అవి ఎక్కడా పనిచేయడంలేదు.
● బందరు మండలంలోని 34 పంచాయతీల్లో 32 చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎక్కడా సేంద్రియ ఎరువు తయారీ ప్రారంభించలేదు.
● గూడూరు మండలంలో 26 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఏడింట మాత్రమే సేంద్రియ ఎరువుల తయారీ ప్రక్రియ ప్రారంభించారు.
తిరువూరు మండలంలో 20 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఎరుకోపాడు, మునుకుళ్లలో తప్ప మిగిలిన చోట్ల నిరుపయోగమయ్యాయి.
నెరవేరని లక్ష్యం
జిల్లాలోని రమారమి 80 శాతం పంచాయతీల్లో చెత్తసంపద కేంద్రాలను నిర్మించారు. కార్యక్రమ పర్యవేక్షణ నిమిత్తం గ్రామాల్లో గ్రీన్ అంబాసిడర్‌లను నియమించినా నిధుల కొరత, ఇతరత్రా వసతుల లేమి వంటి కారణాలతో వేళ్లమీద లెక్కించే స్థాయిలో మినహా మిగిలినవి నిరుపయోగంగా మిగిలాయి. గడిచిన మే నెలలో ప్రభుత్వం మనం, మనపరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా జిల్లాలో మండలానికి రెండు చొప్పున మొత్తం 98 గ్రామాలను ఎంపిక చేసి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంపికచేసిన గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి చెత్తసేకరించడం, కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామస్థుల భాగస్వామంతో పాటు కార్యక్రమ నిర్వహణకు ఆర్థిక ఇబ్బందుల అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఇంటి నుంచి రోజుకు రూ.2 చొప్పున నెలకు రూ.60 వసూలు చేయాలి. వసూలయ్యే మొత్తం నుంచి ఆయా పంచాయతీల్లో పనిచేసే గ్రీన్ అంబాసిడర్లు, చెత్తరవాణా చేసే వాహనాల నిర్వహణ, చెత్తనిర్వహణ కేంద్రాల్లో ఇతర అవసరాలకు వినియోగించాలని ఆదేశించడం ద్వారా కార్యక్రమ నిర్వహణ కోసం ఆర్థిక ఊతం కల్పించారు.
ఆచరణలో తొలగని ఇబ్బందులు
మనం, మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పంచాయతీలను ఆరు నెలల వ్యవధిలో వ్యర్థ రహిత పారిశుద్ధ్య పంచాయతీలుగా తీర్చిదిద్దాల్సి ఉంది. లక్షసాధనలో భాగంగా అవసరమైన సిబ్బందిని నియమించడంతో పాటు చెత్త తరలింపునకు అవసరమైన వాహనాలను సమకూర్చుకున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా సేకరించిన చెత్తను సంపద కేంద్రంలో ఎరువుగా మార్చే విషయంలో కొన్ని చోట్ల విద్యుత్తు, ఇంకొన్ని చోట్ల నీరు వంటి వసతులు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో ఎరువు తయారుచేసే పరిస్థితి లేకపోవడంతో సమీప పంచాయతీలకు చెత్త తరలించాల్సి వస్తోంది. ప్రభుత్వ సూచనల మేరకు తయారైన ఎరువును విక్రయించే విషయంలో వ్యవసాయశాఖ సహకారం అందించాల్సి ఉంది.
● రెండో ఫేజ్‌లో భాగంగా ప్రతి మండలం నుంచి మరో నాలుగు నుంచి పది గ్రామాలను మనం, మనం పరిశుభ్రత కోసం ఎంపిక చేస్తూ ఇప్పటికే అధికారులు జాబితాలను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అధికారులతో ఏర్పాటైన జిల్లా, గ్రామ స్థాయి కమిటీలు ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రామాల్లో లోటుపాట్లను గుర్తించి సంపద కేంద్రాలను పూర్తిగా వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలి. తయారైన ఎరువుకు మార్కెటింగ్ కల్పించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.
నూరు శాతం ఫలితం సాధించేలా చర్యలు
మనం, మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా నూరు శాతం సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకువస్తాం. విద్యుత్తు, నీటి కొరత ఉన్న కేంద్రాల్లో ఆర్థిక సంఘ నిధులు వెచ్చించి వాటిని సమకూర్చుకోవాలని సూచించాం. కొన్ని కేంద్రాల్లో ఎరువు తయారవుతోంది. మార్కెటింగ్ చేసే విషయంలో వ్యవసాయశాఖ సహకారం తీసుకుని ప్రభుత్వ లక్ష్యాన్ని నూరు శాతం సాధిస్తాం. - జ్యోతిర్మయి, డివిజనల్ పంచాయతీ అధికారి
జిల్లాలోని గ్రామ పంచాయతీలు 981
నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు 903
వినియోగంలో ఉన్నవి 263
ఇదీ చదవండి: కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్