బెజవాడ ఆటోనగర్ తెరుచుకుంది. లాక్‌డౌన్ కారణంగా దాదాపు 3నెలలు పాటు మూతపడిన జవహర్ ఆటోనగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, జేఆర్‌డీ ఐలా పారిశ్రామికవాడల్లో ఒక్కొక్కటిగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమలు, ఆటోమొబైల్ వర్క్‌షాపులు, దుకాణాలు తెరుచుకుని పరిమిత సిబ్బందితో పనులు ప్రారంభించాయి.
నిరాశాజనకమే
అయితే 3 నెలల తర్వాత ప్రారంభమైన వ్యాపార కార్యకలాపాలు ఆశాజనకంగా ఉంటాయనుకున్న పారిశ్రామికవేత్తలకు నిరాశే ఎదురవతోంది. తయారీ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన మార్కెట్ ఇంకా తెరుచుకోకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మార్కెట్ పుంజుకోవాలంటే ప్రజారవాణాతో పాటు ఇతర నిబంధనలు సడలించాల్సి ఉండటంతో నామమాత్రంగానే పరిశ్రమలు నడుస్తున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అవసరమైనవి ఏంటి, అంతగా అవసరం లేనివి ఏమిటి అనే స్పష్టతతో ఉండటంతో అన్ని రకాల ఉత్పత్తుల వ్యాపారం ఒకేలా ఉండదని అంచనా వేస్తున్నారు.
పరిమిత సిబ్బందితో పనులు
తెరుచుకున్న పరిశ్రమల్లో 30 శాతం సిబ్బందే పనిచేస్తున్నారు. సగానికి సగం వరకు ఉత్పత్తులను తగ్గించేసి ఉన్న సిబ్బందినే రోజు విడిచి రోజు వచ్చేలా ప్రణాళికలు చేసుకున్నారు. ప్రతి దుకాణం, వర్క్‌షాపులు, ఫౌండ్రీల్లో భౌతిక దూరం పాటించటం, మాస్క్‌లు ధరించడం, సిబ్బందికి ధర్మల్ స్కానింగ్ పరీక్షలు, శానిటైజర్ వాడకం వంటివి తప్పనిసరి చేశారు. ఇవన్నీ యజమానులకు అదనపు భారంగా మారాయి. పరిశ్రమలు కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
ప్యాకేజీతో ఏదీ ప్రయోజనం!
కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ, ఇతర రాయితీలు క్షేత్రస్థాయిలో అంత ఉపయోగకరంగా లేవన్నది పారిశ్రామికవేత్తల వాదన. ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతాలు చెల్లించుకోవాల్సి రావటం.. పీఎఫ్ చెల్లింపు పరిధిలోకి ఎక్కువ పరిశ్రమలు రాకపోవటం వంటి ఇబ్బందులు ఉన్నాయని వారంటున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు కేంద్రం ప్రత్యక్షసాయం అందిస్తే.. పరిశ్రమలు పరోక్షంగా కోలుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు కొత్తవాటికే తప్ప ఇప్పటికే నడుస్తున్న వాటికి పెద్ద ఉపయోగం లేదంటున్నారు. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోయిన కారణమూ ఉత్పత్తిమీద ప్రభావం చూపుతోందని వాపోతున్నారు.
మేము పరిశ్రమలు తెరవడమైతే తెరిచాం.. పరిమిత సిబ్బందితో ఉత్పత్తి ప్రారంభించాం. అయితే అవి ఎప్పటికీ మార్కెట్ అవుతాాయో తెలియదు. అప్పటివరకు సిబ్బందికి జీతాలు, ఇతర ఖర్చులు ఎలా సమకూర్చుకోవాలో అర్థం కావడంలేదు. -- విజయవాడ ఆటోమొబైల్ పరిశ్రమ యజమాని
వ్యాపార విస్తరణ మాటే లేదు
కరోనాకు ముందు వ్యాపార విస్తరణకు ఉన్న ఆలోచనలను తాజా పరిస్థితుల దృష్ట్యా విరమించుకోవాల్సి వచ్చిందని వ్యాపారవేత్తలు అంటున్నారు. క్లయింట్స్‌తో మాట్లాడి వ్యాపార కార్యకలాపాలు సాగించేందుకు ఆన్ లైన్ పద్ధతి పెద్దగా ఉపకరించదని చెప్తున్నారు. వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి కట్టడి అయ్యాక మాత్రమే చిన్న పరిశ్రమలకు పూర్వవైభవం వస్తుందని స్పష్టం చేస్తున్నారు. కార్మికులు రావటానికి ప్రజా రవాణా సదుపాయం లేకపోవటమూ పరిశ్రమలకు పెద్ద ఇబ్బందిగానే మారింది.
కరోనా కాలంలో తీవ్రస్థాయిలో ప్రభావితమైన రంగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చాలా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇవి లాకౌట్ దిశగా వెళ్లకుండా ఉండాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉదార తోడ్పాటు అవసరమని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
ఇవీ చదవండి... వలసల పంజరంలో బాల్యం