కృష్ణాజిల్లాలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో జరిగిన గోవుల మృతిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం లోతుగా పరిశీలిస్తోంది. శవపరీక్ష నివేదికలో... పశుగ్రాసంపై రసాయనాల అవశేషాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది. రసాయనాలు అధిక మోతాదులో ఉండటం కారణంగానే ఆవులు మృతి చెందాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ నివేదిక కేసులో కీలకం కానుంది. నివేదిక వస్తే... ఏ రసాయనం ఎంత మోతాదులో ఉందో తెలుస్తుంది. ఫోరెన్సిక్ నివేదిక వచ్చేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు చెపుతున్నారు.
మరోవైపు అన్ని పార్టీల రాజకీయ నేతలు గోశాలను పరిశీలించి... గోవుల మృతికి కుట్ర జరిగిందని ఆరోపణలు చేశారు. దీంతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సీసీఎస్ ఏసీపీ శ్రీనివాసరావు సిట్ అధికారిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే విజయవాడ సీపీతో సమావేశమయ్యారు. అనంతరం గోశాలకు వెళ్లి పరిశీలించారు. పశుగ్రాసం నిల్వ ఉంచే ప్రాంతాలను తనిఖీ చేశారు. పశుగ్రాసం ఎవరెవరు సరఫరా చేస్తారు అనే కోణంలో దర్యాప్తు చేశారు.
ఇటీవల కాలంలో ఎంత మంది... ఎంత మోతాదులో పశుగ్రాసాన్ని సరఫరా చేశారు అనే విషయంపై ఆరాతీశారు. పచ్చగడ్డి తక్కువ సమయంలోనే ఏపుగా పెరిగేందుకు నైట్రోజన్‌తో కూడిన రసాయన ఎరువులను వినియోగిస్తారని తెలుస్తుంది. సాధారణంగా నైట్రోజన్ రసాయనం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెపుతున్నారు. ఆవులకు సరఫపరా చేసిన పశుగ్రాసానికి కూడా నైట్రోజన్ రసాయనం వాడారా అనే విషయంపై ఆరాతీశారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.
ఇదీ చదవండీ...