కృష్ణా జిల్లాలోని 19 పంచాయతీల్లో మదింపు కొన్నాళ్లుగా జరగలేదని జిల్లా ఆడిట్‌శాఖ గణాంకాలు తెలియజేస్తున్నారు. వీటిలో కొన్నింటిలో ఏడాదిగా.. మరికొన్నింటిలో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఒక పంచాయతీలో ఏళ్ల తరబడి లెక్కలు చెప్పడం లేదు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి, కొటికలపూడి, పామర్రు మండలంలోని పామర్రు, జుజ్జవరం, నాగాయలంక మండలంలోని గణపేశ్వరం, తలగడదీవి, ఆగిరిపల్లి మండలంలోని ఆగిరిపల్లి, చినఆగిరిపల్లి, అమ్మవారిగూడెం, పమిడిముక్కల మండలంలోని చోరగుడి, కూడేరు పంచాయతీల్లో 2018-19, 2019-20లకు మదింపు జరగలేదు. జగ్గయ్యపేట మండలంలోని అనుమంచిపల్లి, పెనుగంచిప్రోలు మండలంలోని నవాబ్‌పేట, వత్సవాయి మండలంలోని దబ్బాకుపల్లి, పామర్రు మండలంలోని నిమ్మకూరు, నిభానుపూడి, పమిడిముక్కల మండలంలోని అలీనక్కీపాలెం పంచాయతీల్లో ఏడాదిగా ఆడిట్ జరగాల్సి ఉంది. పెనమలూరు మండలంలోని యనమలకుదురు పంచాయతీలో ఏకంగా ఐదేళ్లుగా ఆడిట్ నిర్వహించలేదు. దీనిపై పలుమార్లు ఆ శాఖ అధికారులు మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కనిపించలేదు. మదింపు కోసం అధికారులు పలుమార్లు పంచాయతీలకు వెళ్లినా.. కార్యదర్శులు అందుబాటులో లేక తిరిగిరావడం పరిపాటిగా మారుతోంది.
డీపీవోకు తెలియజేస్తాం
జిల్లా వ్యాప్తంగా 970 పంచాయతీలకు ఆడిట్ జరగాల్సి ఉండగా 19 పంచాయతీల కార్యదర్శులు రికార్డులు ఇవ్వలేదు. దాని కారణంగా ఆడిట్ నిర్వహించలేకపోయాం. ఏయే పంచాయతీల్లో మదింపు జరగలేదో వివరాలతో జిల్లా పంచాయతీ అధికారికి లేఖ రాస్తున్నాం. డిసెంబరులోపు మదింపు పూర్తిచేయాల్సి ఉంది. లేదంటే నిధులు ఆగిపోతాయి. రికార్డులు అందిస్తే వెంటనే ఆడిట్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
-డీడీజీ ముళ్లర్, జిల్లా ఆడిట్ అధికారి
అభివృద్ధిపై ప్రభావం
ప్రభుత్వాల నుంచి మంజూరయ్యే నిధులతో పాటు పంచాయతీలకు వచ్చిన ఆదాయం తదితరాలను కార్యదర్శులు లెక్క చెప్పాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల అది జరగడం లేదు. ఏళ్లతరబడి ఆడిట్ పెండింగ్‌లో ఉంటే ఆ పంచాయతీలకు మంజూరయ్యే నిధులు కూడా నిలిపివేసే అవకాశాలు ఉంటాయి. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులపై దీని ప్రభావం పడుతుంది. సహకరించని కార్యదర్శుల గురించి మదింపు శాఖ అధికారులు సంబంధిత మండల పరిషత్తు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. పలు చోట్ల స్పందన కనిపించడం లేదు. సహకరించని కార్యదర్శులకు అదనంగా పలు పంచాయతీల బాధ్యతలు కేటాయించడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించడంతో ఏం చేస్తారులే అనే భావనతో మరికొందరు కార్యదర్శులు కూడా రికార్డులు ఇవ్వడం లేదు. ఇలాగే వదిలేస్తే నిధుల వినియోగంలో అక్రమాలు వెలుగులోకి రాకపోగా.. ప్రభుత్వ నిధులు కూడా నిలిచిపోయే ప్రమాదముంది. ఈ నెలాఖరులోపు మదింపు నిర్వహించకుంటే కచ్చితంగా నిధులు ఆగిపోతాయని ఆ శాఖ అధికారులు అంటున్నారు. దీనిపై పంచాయతీ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.