కొవిడ్-19 ప్రభావంతో స్కూల్లు తెరుచుకున్నా 9, 10 తరగతి విద్యార్ధులకు మాత్రమే క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. దీంతో కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని మోపిదేవి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో.. 90 శాతం మంది తరగతులకు హాజరవుతున్నారు. ఇక్కడ 6 నుంచి పదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో సుమారు 800 మంది విద్యార్ధులు విద్యను అభ్యసించే వారు. లాక్డౌన్ అనంతరం స్కూల్ తెరచినా విద్యార్ధుల హాజరు తక్కువగానే ఉండేది. పాఠశాలలో తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలు బట్టి ఇప్పుడిప్పుడే విద్యార్ధుల హాజరు శాతం పెరుగుతోంది. గదికి కేవలం 16 మంది విద్యార్థులను మాత్రమే కూర్చొబెడుతున్నారు. స్కూల్‌కి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, శానిటైజేషన్ చేసుకోవాలి, సామాజిక దూరం పాటించాలని ఉపాధ్యాయులు విద్యార్ధులకు అవగాహన కల్పిస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికీ వేలల్లో కేసులు నమోదు కావడం విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. దీనికి తోడు కొవిడ్ పరీక్షలు నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లడం.. విద్యార్ధుల తల్లిదండ్రులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. విద్యార్ధులకు కరోనా పరీక్షలు పాఠశాలలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రస్తుతం 9, 10 వ తరగతి విద్యార్ధులకు తరగతులు చెప్పడానికే చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ఉపాధ్యాయులు. పూర్తిగా స్కూల్లు తెరిచిన తరువాత అన్ని తరగతుల విద్యార్థులు వస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవంటున్నారు. దూర ప్రాంతాల నుంచి బస్సు, ఆటోల్లో వచ్చే విద్యార్ధుల తల్లిదండ్రులు ఇంకొంత ఎక్కువగానే భయపడుతున్నారు. బడికి వచ్చి, వెళ్లేటప్పుడు కరోనా సోకే ప్రమాదం ఉండటం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో పిల్లలు కూడా చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించలేకపోతున్నారంటున్నారు.
ఇవీ చూడండి...