వాళ్లంతా నిరుపేదలు ..రెక్కాడితే కానీ డొక్కాడని సాధారణ కూలీలు .. బతుకుదెరువుకు తెల్లవారుజామున బండికట్టుకుని బయలుదేరారు . బతుకుల్లో వెలుగు నింపుకునేందుకు వెళుతున్న వారి జీవితాల్లో శాశ్వతంగా చీకటి అలముకుంది. నూజివీడు మండలం గొల్లపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన 14 కుటుంబాల్లో ఆవేదన నింపింది.
వేకువజామునే లేచి చద్ది కట్టుకుని జీవనపోరాటం చేసేందుకు వెళుతున్న కూలీల బతుకులు తెలవారుతుండగానే తెల్లారిపోయాయి . కృష్ణాజిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద లయన్ తండాకు చెందిని 14 మంది కూలీలు ఆటోలో వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. 8 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారికి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు.. మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారికి వెంటిలేటర్లు అమర్చి అత్యాధునిక చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. తండా నుంచి బాపులపాడు మండలంలో వరిపంట నూర్పిడి కోసం కూలీలు వెళుతున్నారని పోలీసులు తెలిపారు. అతివేగమా ..నిద్రమత్తులో రోడ్డు ప్రమాదం జరిగిందా అనే కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డుప్రమాద ఘటనపై వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఆరా తీశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఆళ్లనాని భరోసా ఇచ్చారు . తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి అన్నారు.
ప్రమాద ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కూలీలు మృతి చెందడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవనం కోసం ఉదయాన్నే పనులకు బయలుదేరిన కూలీలు మృత్యువాతపడటం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: పుర ఓట్ల లెక్కింపు నేడే.. అభ్యర్థుల్లో ఉత్కంఠ