Degree Student Rape in Machilipatnam: మచిలీపట్నంలో అమానుషమైన ఘటన జరిగింది. ఓ డిగ్రీ విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యం స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం మధ్యాహ్నం వేళ వసతి గృహం నుంచి బయటకు వెళ్లిన విద్యార్థిని.. రాత్రి పది గంటల సమయానికి వసతి గృహనికి చేరుకుంది. ఆమె వసతి గృహనికి చేరుకున్న సమయంలో మద్యం మత్తులో అపాస్మారక స్థితిలో ఉంది. సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అసలు విషయం బయటకు వచ్చింది.
మచిలీపట్నంలోని ఎస్సీ వసతి గృహంలో ఉంటూ ఓ విద్యార్థిని డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటోంది. ఆదివారం కళాశాలకు సెలవు కావటంతో వసతి గృహంలోనే ఉంది. మధ్యాహ్నం వేళ పని ఉందని బయటకు వెళ్లింది. సాయంత్రమైనా ఆమె తిరిగి హాస్టల్‌కి రాకపోవటంతో.. ఆచూకీ కోసం హాస్టల్ సిబ్బంది వెతికారు. ఎంత వెతికినా ఆమె ఎక్కడుందనే విషయం తెలియరాలేదు. చివరకు రాత్రి పదిగంటల సమయంలో మద్యం మత్తులో, స్పృహా కోల్పోయే స్థితిలో విద్యార్థిని హాస్టల్‌కు చేరుకుంది. దీంతో ఆమెను వసతి గృహ సిబ్బంది జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెపై ఆత్యాచారం జరిగినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అధికార పార్టీకి చెందిన సతీష్ అనే నేత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుండగా.. పార్టీ పెద్దలు కేసును రాజీ చేసేందుకు రంగంలోకి దిగినట్లు సమాచారం.
మునిగిపోతున్న బోటులోంచి బయటపడ్డ 8మంది..: విశాఖ చేపల చెరువు నుంచి రెండు రోజులు క్రితం 8 మంది మత్స్యకారులు బోటులో చేపల వేటకు వెళ్లారు. విజయనగరం జిల్లా కంచెరు వద్దకు చేరుకోగానే మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటుకు రంధ్రం పడి మునిగిపోసాగింది. దానిని గమనించిన వారు విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణకు సమాచారం అందించారు. దాంతో రామకృష్ణబాబు మత్స్య శాఖ అధికారులకు ఘటన సమాచారం అందించారు. దీంతో స్పందించిన అధికారులు.. రెండు బొట్లలో సహాయక సిబ్బందిని పంపించి, 8మంది బాధితులను సురక్షితంగా విశాఖకు తీసుకువచ్చారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు..: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చింతలపూడి రాఘవపురం వెళ్తున్న లారీ.. నరసాపురం వైపు నుంచి వస్తున్న టాటా ఏసీని ఢీకొట్టింది. ప్రధాన రహదారిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ ప్రమాదం జరగగా.. డ్రైవర్ టాటా ఏసీ వాహనంలోనే ఇరుకున్నారు. గమనించిన స్థానికులు ట్రాక్టర్ సహాయంతో డ్రైవర్ను బయటకు తీశారు. ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావటంతో గ్రామస్థులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.