విద్యుద్దీపాల కాంతుల్లో ధగధగలాడే వీధులు.. ఆధ్యాత్మిక ప్రవచనాలు.. ఆత్మీయ ఆలింగనాలు.. అత్తరు సువాసనలు.. హలీం, కబాబుల ఘుమఘుమలు.. నోరూరించే సేమియా పాయసం.. అంతటా రాజసం.. నవాబుల నుంచి గరీబుల దాకా ప్రతి ఒక్కరూ ఏకమై.. జరుపుకొనే సంబరాలు. ఇదంతా ఏటా రంజాన్ మాసంలో రాజధాని నగరంలో కనిపించే వాతావరణం. కానీ.. ఇప్పుడు ఖాళీ వీధులు, ఈద్గాలకు తాళాలు, కళతప్పిన పాతబస్తీ మార్కెట్లు.. కరోనా లాక్‌డౌన్ కారణంగా అంతా ఇంటికే పరిమితమై పండగ చేసుకుంటున్న వేళ నగరంలో రంజాన్ శోభ కనిపించట్లేదు. సరిగ్గా 112 ఏళ్ల కిందట ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు చరిత్రకారులు. అప్పటి భారీ వర్షాలతో మూసీ ప్రళయ గర్జనకు ఆగిన వేడుకలు.. మళ్లీ ఇప్పుడు కరోనా మహమ్మారితో ఆ సందడి మాయమైందన్నారు.
అప్పుడూ ఏ కోలాహలం లేకుండానే..
1908వ సంవత్సరంలోనూ నగరవాసులు ఏ కోలాహలం లేకుండా రంజాన్ జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఏడాది సెప్టెంబరు 27న నెల పొడుపు చూసి రంజాన్ ఉపవాస దీక్షలకు సిద్ధమైన రెండోరోజునే నగరంలో భారీ వర్షాలుపడ్డాయి. అప్పుడొచ్చిన వరదలకు మూసీ పొంగింది. దాని ఉగ్రరూపంలో వేల మరణాలు సంభవించగా.. నగరం రూపురేఖలే మారిపోయాయి. సరిగ్గా రంజాన్ మాసం సమయంలో వచ్చిన ఆ ఉపద్రవంతో పండగ సంబరాలకు దూరంగా ఉండేందుకు మతపెద్దలు నిర్ణయించారు. సాధారణంగా ఈ పండగ కోసం పెట్టే ఖర్చునంతా అప్పట్లో వరద బాధితులకు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఆ ఆదేశాల్ని పాటిస్తూ అంతా పండగను ఏ సందడి లేకుండా జరుపుకొన్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా నగరంలో ఆ పరిస్థితి తలెత్తింది.
సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉండండి
ఈ ఏడాది రంజాన్ మాసమంతా లాక్‌డౌన్‌లోనే గడిచిపోయింది. పండగ నాటికి అన్నీ మారిపోతాయనుకున్నారు. ఇప్పటికీ మార్పు లేకపోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సామూహిక ప్రార్థనలకు అనుమతిలివ్వలేదు. ఈ నేపథ్యంలో మత పెద్దలు నగరంలోని ముస్లిం సోదరులందరికీ సూచనలు జారీచేశారు. మక్కా మసీదు పెద్దలూ.. అంతా ఇళ్లకే పరిమితమై పండగ జరుపుకోవాలని, సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఆదేశాలు పాటించడం మన బాధ్యత
- ఎంఏ ఖదీర్ సిద్దిఖీ, మక్కా మసీద్ సూపరింటెండెంట్
ఇప్పటికే పండగపై ప్రధాన ముఫ్తీ మౌలానా అజీముద్దీన్, ఇస్లామియా విశ్వవిద్యాలయం నుంచి ఫత్వాలు జారీ అయ్యాయి. ప్రభుత్వమూ మనకు ఆదేశాలిచ్చింది. వాటిని పాటించడం మన బాధ్యత. ఇలాంటి ఉపద్రవం, ఈ పరిస్థితి గతంలోనూ వచ్చింది. ఈ సమయంలోనే మనం బాధ్యతగా వ్యవహరించాలి. మనసులో భక్తి ఉంచుకొని ప్రార్థనలు చేయండి.
ఇళ్లలోనే ప్రార్థనలు చేయండి
-రిజ్వాన్ ఖురేషి, మక్కా మసీద్ ఖతీబ్
పర్వదినం రోజున ప్రార్థనల కోసం ఎవరూ ఈద్గాలు, మసీదులకు వెళ్లొద్దు. ఇంటికి పరిమితమై నమాజ్ చేయాలి. ఈ నెలరోజులు ఎలా ఉన్నామో చివరి దాకా ప్రభుత్వ ఆజ్ఞల్ని పాటించాలి. ఆ ప్రకారమే నడుచుకుని ఇళ్లలోనే పండగ చేసుకోవాలి.